కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు

‘‘అవినీతిపరులను జైలుకు పంపేదే భాజపా ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ సర్కారు. కేసీఆర్‌... నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 05 Dec 2022 09:24 IST

నిర్మల్‌ సభలో బండి సంజయ్‌

ఈటీవీ, ఆదిలాబాద్‌: ‘‘అవినీతిపరులను జైలుకు పంపేదే భాజపా ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది నరేంద్రమోదీ సర్కారు. కేసీఆర్‌... నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని శివాజీచౌక్‌లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెరాస, ఎంఐఎం లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తెరాస ప్రభుత్వం ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. సభలు, సమావేశాలకు సైతం కోర్టుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంలో తాకట్టుపెట్టిన కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దీక్ష బూనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలి. కాషాయ జెండా ఎగరాలి. ఏడాది కాలంలో ఇదే జరుగుతుంది. మీరే చూస్తారు. హిందువులు హిందువుల కోసం మాట్లాడితే మతతత్వమవుతుందా’’ అని ప్రశ్నించారు. దిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేయవద్దనడానికి ఆమె ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా అని ప్రశ్నించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నవాళ్లకు, దందాలు చేసిన వాళ్లకు ఈడీ, సీబీఐ నోటీసులు రాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. ‘‘దిల్లీ మద్యం కేసులో కవితకు నోటీసులు రాగానే భాజపా శ్రేణులను తరిమి కొట్టాలని తెరాస కార్యకర్తలకు కేసీఆర్‌ సూచించారు. అయినా భయపడే ప్రసక్తేలేదు. నేను ఎన్నోసార్లు జైలుకు వెళ్లా. లాఠీదెబ్బలు తిన్నా. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం తలపెట్టేలా తెచ్చిన జీవో 317కి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది సార్లు జైలుకు వెళ్లా. కేసీఆర్‌ కుటుంబంలాగా అక్రమ దందాలు చేయలేదు’’ అని అన్నారు.

సొమ్ములు వసూలు చేసిన మంత్రి, కలెక్టర్‌

నిర్మల్‌ మున్సిపాల్టీలో నాలుగో తరగతి ఉద్యోగాల కోసం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఒక్కొక్కరి దగ్గర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారని సంజయ్‌ ఆరోపించారు. జనవరి పదో తేదీలోగా తీసుకున్న డబ్బులు తిరిగి నిరుద్యోగులకు ఇవ్వనట్లయితే నిర్మల్‌ గడ్డపై యుద్ధం ప్రకటిస్తానని అన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆదిలాబాద్‌- ఆర్మూర్‌ రైల్వేలైన్‌, ఆదిలాబాద్‌ విమానాశ్రయం అందుబాటులోకి రావడం లేదని ఆరోపించారు. పార్టీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు మనోహర్‌రెడ్డి, రావుల రాంనాథ్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని