కేంద్రం నిరంకుశ విధానాలపై యుద్ధం

తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస పార్లమెంటు సభ్యులకు సూచించారు.

Updated : 06 Dec 2022 07:29 IST

పార్లమెంటు వేదికగా గళమెత్తాలి
కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఎండగట్టాలి
‘ఎమ్మెల్యేలకు ఎర’లో భాజపా నైజాన్ని దేశమంతా తెలియచెప్పాలి
తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస పార్లమెంటు సభ్యులకు సూచించారు. కేంద్ర నిరంకుశ విధానాలను, కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులను ఉభయ సభల్లో నిలదీయాలని, ఇతర పార్టీలతో కలిసి పోరాడాలని మార్గదర్శనం చేశారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయడంతోపాటు బహిష్కరణకూ వెనుకాడవద్దని సూచించినట్లు తెలిసింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ అంశాన్ని సభలో ప్రస్తావించడం ద్వారా భాజపా నైజాన్ని దేశమంతటికీ తెలియజెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోంది. రాష్ట్రాన్ని ప్రోత్సహించకపోగా..అంతులేని వివక్ష, ఆంక్షలతో ప్రగతిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోంది. కేంద్రం నిర్వాకం వల్ల రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.40 వేల కోట్ల మేరకు రాబడి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పైపెచ్చు ‘ఎమ్మెల్యేలకు ఎర’ వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని భాజపా కుట్ర చేసింది. ఈ వ్యవహారాన్ని దేశమంతటికీ తెలియజెప్పాలి. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలు, విభజన హామీల అమలులో వైఫల్యాలు, భాజపా దివాలాకోరు రాజకీయం తదితరాలపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేయాలి. పార్లమెంటులో ధర్నాలు, నిరసనలతో పాటు పార్లమెంటు బయటా ఆందోళనలు చేపట్టాలి. కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ముందుకుసాగాలి. ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వవైఖరి, ఆర్థికపరమైన అంశాల్లో కేంద్రం అసంబద్ధ విధానాలను ఎండగట్టాలి.

దాడులపై ధ్వజమెత్తుదాం

కేంద్రం విపక్షాలు లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా దాడులకు పాల్పడుతోంది. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు వాటిని సాధనాలుగా మార్చుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ‘ఎమ్మెల్యేలకు ఎర’ గుట్టును రట్టుచేయడంతో ప్రతిగా సీబీఐ, ఐటీ, ఈడీలను రంగంలోకి దింపింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై గురిపెట్టింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఇదే వైఖరిని అనుసరిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలతో కలిసి పార్లమెంటులో ఈ అంశంపై గళమెత్తాలి. తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించినందున, పార్లమెంటు కొత్త భవనానికీ అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేయాలి. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం చేసిన శాసనసభ తీర్మానాలను ఆమోదించకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం వంటి వాటిపైనా ధ్వజమెత్తాలి.

జాతీయ సమస్యలపైనా

తెరాసకు మరికొన్ని రోజుల్లోనే భారాసగా గుర్తింపు రాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్యలతోపాటు దేశ సమస్యలనూ పార్లమెంటులో ప్రస్తావించాలి’’ అని సీఎం సూచించారు. ఈ సందర్భంగా విభజన హామీల అమలు స్థితిగతులు, రాష్ట్రం పన్నుల రూపేణా కేంద్రానికి జమచేస్తున్న నిధులు, కేంద్రం నుంచి తిరిగి వస్తున్నవి, కేంద్ర బకాయిలు, వివిధ రాష్ట్రాలకు ఇచ్చిన కొత్త ప్రాజెక్టులు, తెలంగాణను విస్మరించిన తీరు తదితర సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాలను సీఎం ఎంపీలకు అందజేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని