కమల కాంతులే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ (భాజపా) మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది! రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది!! తాజాగా అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఘన విజయం సాధిస్తుందని సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో పేర్కొన్నాయి.

Published : 06 Dec 2022 06:31 IST

గుజరాత్‌లో వరుసగా ఏడోసారి విజయభేరి మోగించనున్న భాజపా
కాంగ్రెస్‌కు రెండో స్థానమే.. వెనుకంజలో ఆమ్‌ఆద్మీ పార్టీ
హిమాచల్‌లో హోరాహోరీ.. కాషాయదళానిదే కాస్త పైచేయి
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల వెల్లడి

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ (భాజపా) మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది! రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది!! తాజాగా అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఘన విజయం సాధిస్తుందని సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో పేర్కొన్నాయి. వాటి అంచనాల ప్రకారం- గుజరాత్‌లో భాజపాకు చాలా దూరంలో కాంగ్రెస్‌ రెండో స్థానానికి పరిమితం కానుంది. ఇక్కడ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి తీవ్ర నిరాశ ఎదురుకానుంది. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆ పార్టీకి రెండంకెల సీట్లు రావడమూ గగనమే! మరోవైపు- హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీని కమలదళం సాధించగలదని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేశాయి. ఆ రాష్ట్రంలో ఆప్‌ ప్రభావం అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి.

గుజరాత్‌లో ఈ దఫా రికార్డు స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించాలని భాజపా గట్టి పట్టుదలతో కనిపించింది. అందుకు తగ్గట్టే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా పార్టీ అగ్ర నేతలంతా అక్కడ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా మోదీ అన్నీతానై వ్యవహరించారు. ప్రచార సభల్లో కాంగ్రెస్‌, ఆప్‌లపై నిప్పులు చెరిగారు. మరోవైపు- భారత్‌ జోడో యాత్రతో తీరిక లేకుండా ఉన్న హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాల్గొనలేదు. హిమాచల్‌లో ప్రతిసారీ పాలనా పగ్గాలు చేతులు మారే సంప్రదాయానికి తెరదించి, తాము అధికారంలో కొనసాగే అవకాశాలున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చెబుతుండటంతో కమలనాథుల్లో జోష్‌ కనిపిస్తోంది. గుజరాత్‌, హిమాచల్‌లలో ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో తేలాలంటే.. ఆ రోజు ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు