పేదల భూములు లాక్కుంటారా..!

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Updated : 06 Dec 2022 09:16 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజం
ధరణిపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి కలెక్టరేట్‌-న్యూస్‌టుడే: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ‘ధరణి’ కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. ధరణి పోర్టల్‌తో పేదల భూములను లాక్కొని అమ్ముకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘‘అప్పట్లో జైల్లో ఉన్న నేను కూతురి పెళ్లి కోసం బెయిల్‌ పిటిషన్‌ వేసుకుంటే దిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి అడ్డుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. ఇప్పుడు తన కుమార్తెకు సీబీఐ నోటీసులిస్తే ఉలిక్కిపడుతున్నారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటే తప్పనిపించలేదా? కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తెరాస ప్రభుత్వం అవినీతిని వివరించాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేపడతాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. నిరసన అనంతరం రేవంత్‌రెడ్డి వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు: భట్టి

భూ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ధరణి పోర్టల్‌తో సర్వే నంబర్లు, విస్తీర్ణం, పేర్లు తప్పుగా నమోదు చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. గత ప్రభుత్వాలు 24 లక్షల ఎకరాలను ప్రజలకు పంపిణీ చేయగా వాటిలో 12 లక్షల ఎకరాలను పార్ట్‌-బీలో నమోదు చేశారు. అభివృద్ధి పేరుతో ఇనాం, ఎసైన్డ్‌, ప్రభుత్వ భూములను లాక్కొని మరింత పేదలుగా మారుస్తున్నారు’’ అని భట్టి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ధరణి పేరిట రైతులను సీఎం క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోడు పంచాయితీతో అటవీశాఖ అధికారి హత్యకు గురయ్యారని, ఇందుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. జహీరాబాద్‌ మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, మాజీ ఎమ్మెల్యే గంగారాం పాల్గొన్నారు. కామారెడ్డిలో నిరసన అనంతరం నాయకులు, కార్యకర్తలు బ్యారికేడ్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరికొందరికి గాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసులను తప్పించుకుని లోనికి దూసుకెళ్లారు. కలెక్టర్‌ సమావేశంలో ఉండటంతో అదనపు కలెక్టరేట్‌ ఛాంబర్‌లో బైఠాయించారు. చివరకు కలెక్టర్‌ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు