సంక్షిప్త వార్తలు(5)

రామచంద్రయాదవ్‌ ఇంటిపై వైకాపా రౌడీమూకల దాడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాష్టీకానికి మరో నిదర్శనమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Updated : 06 Dec 2022 06:33 IST

పెద్దిరెడ్డి దాష్టీకానికి మరో నిదర్శనం: కొల్లు రవీంద్ర

రామచంద్రయాదవ్‌ ఇంటిపై వైకాపా రౌడీమూకల దాడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాష్టీకానికి మరో నిదర్శనమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ దాడికి జగన్‌రెడ్డి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పూటకో దాడి, రోజుకో హత్య బీసీ ఉద్దరణా? అని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘ఒక వైపు బీసీలపై దాడులు చేస్తూ, హత్యలకు పాల్పడుతూ.. జయహో బీసీ అంటూ సభ పెట్టడం మోసం చేయడం కాదా? బీసీలకు ఏం చేశారని సభ పెడుతున్నారు...’’ అని కొల్లు రవీంద్ర నిలదీశారు.


పొరుగుసేవల సిబ్బందిని తప్పించేందుకు కుట్ర

భాజపా నేత మాధవ్‌ ఆరోపణ

ఈనాడు-అమరావతి: ‘వార్షిక క్యాలెండర్‌’ ప్రకారం ఉద్యోగ నియామకాలను జరపకపోగా.. పొరుగు సేవల కింద చేరిన ఉద్యోగులను విధుల నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భాజపా శాసనమండలి పక్ష నేత పీవీఎన్‌ మాధవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పొరుగుసేవల ఉద్యోగులను తప్పించేలా గతనెల 28న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం దారుణం. తాము అధికారంలోకి వస్తే పొరుగుసేవల ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ హామీ ఇచ్చి.. ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే అత్యధికంగా ఉన్నారు’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


‘సమరసత’కు ఆలయాల పునఃనిర్మాణ బాధ్యతలు వద్దు: సీపీఎం  

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: దేవాలయ పునఃనిర్మాణ బాధ్యతలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రోత్సాహంతో నడుస్తున్న సమరసత ఫౌండేషన్‌కు అప్పగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. ఇటీవల దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణమూర్తి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో, 1400 దళితవాడలలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా దేవాలయాలు నిర్మిస్తున్నామని, ఇందులో 340 దేవాలయాల బాధ్యతలను సమరసత ఫౌండేషన్‌కు అప్పగిస్తున్నామని ప్రకటించారని తెలిపారు. ఒక్కో దేవాలయానికి ప్రభుత్వం పది లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారన్నారు. సమరసత తరహా సంస్థలు ఘర్‌వాసీ పేరుతో వివిధ దళితవాడలు, కాలనీల్లో మతాల మధ్య చిచ్చు పెట్టేలా, ఉద్రికత్తలు రెచ్చగొట్టేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాయని విమర్శించారు. మత సామరస్యానికి విఘాతం కలిగించాయని లేఖలో పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలు మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ.. భాజపాకు ఉపకరించే రీతిలో పని చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి, సమరసత ఫౌండేషన్‌కు దేవాలయ నిర్మాణ బాధ్యతలను అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.


హామీల అమలులో తెరాస ప్రభుత్వం విఫలం: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు. వారికి 3 ఎకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం అందరికీ అందేలా పోరాడాలని సూచించారు. ఆదాయం పెంచుకోవడానికి మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం తగదంటూ రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనరుకు తెదేపా తెలుగు మహిళా విభాగం వినతిపత్రం అందజేసినట్లు పార్టీ మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


జేడీయూ అధ్యక్షుడిగా మళ్లీ లాలన్‌సింగ్‌

దిల్లీ: జనతాదళ్‌(యునైటెడ్‌) అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లాలన్‌ సింగ్‌ సోమవారం మళ్లీ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు సైతం ముగిసిందని, అందువల్ల లాలన్‌సింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జేడీయూ ప్రధాన కార్యదర్శి ఆఫాక్‌ అహ్మద్‌ఖాన్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు