చర్చి భూముల అక్రమాల్లో వైకాపా పెద్దలే సూత్రధారులు

విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్‌సీ(ది కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ నార్తెన్‌ సర్కార్స్‌) భూముల అక్రమాల్లో వైకాపా పెద్దలే సూత్రధారులని జనసేన కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Published : 06 Dec 2022 04:25 IST

విశాఖ జేసీకి జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఫిర్యాదు

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్‌సీ(ది కన్వెన్షన్‌ ఆఫ్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ నార్తెన్‌ సర్కార్స్‌) భూముల అక్రమాల్లో వైకాపా పెద్దలే సూత్రధారులని జనసేన కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు జీవీఎంసీ ధారాదత్తం చేసిన రూ.62 కోట్ల టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌)ను రద్దు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన 3,600 చదరపు గజాల స్థలం కబ్జాకు కొంత మంది అధికారులు రూ.కోట్లలో ముడుపులు తీసుకొని సహకరించారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో జేసీ విశ్వనాథన్‌కు మూర్తియాదవ్‌ వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ జి.వెంకటేశ్వరరావు కలసి సీబీసీఎన్‌సీలో రూ.కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేశారని ఆరోపించారు. రహదారులు వేయకుండానే, డోర్‌ నంబరు లేని దానికి టీడీఆర్‌ మంజూరు చేయడం జీవీఎంసీ అధికారుల అవినీతికి పరాకాష్ఠ అని విమర్శించారు. సీబీసీఎన్‌సీ స్థలం 18 క్రిస్టియన్‌ సంస్థలకు చెందినదని, దానికి ఒక వ్యక్తి పేరుతో టీడీఆర్‌ ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్నారు. సీబీసీఎన్‌సీ ప్రాంగణంలో సర్వే సంఖ్య 75/4లో ఉన్న 3,600 చదరపు గజాల సాంఘిక సంక్షేమశాఖ స్థలానికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలన్నారు. సీబీసీఎన్‌సీ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడితే జీవీఎంసీ అధికారుల అవినీతి బయటపడుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని