‘సీమెన్స్‌’ ప్రాజెక్టులో అవినీతిపై కేసులో సీనియర్‌ ఐఏఎస్‌లను ఎందుకు విచారించడం లేదు?

తెదేపా హయాంలో చేపట్టిన ‘సీమెన్స్‌’ ప్రాజెక్టులో రూ.241 కోట్ల అవినీతి జరిగిందంటూ నమోదైన కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అజయ్‌జైన్‌, రావత్‌, ప్రేమ్‌చంద్రారెడ్డిలను ఎందుకు విచారించడం లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు.

Published : 06 Dec 2022 04:48 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో చేపట్టిన ‘సీమెన్స్‌’ ప్రాజెక్టులో రూ.241 కోట్ల అవినీతి జరిగిందంటూ నమోదైన కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అజయ్‌జైన్‌, రావత్‌, ప్రేమ్‌చంద్రారెడ్డిలను ఎందుకు విచారించడం లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. నిజంగా తప్పు జరిగితే ఈ కేసును ఏడాదిగా దర్యాప్తు చేస్తున్నా ఒక్క ఆరోపణను కూడా ఎందుకు రుజువు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈడీ పేరు చెప్పగానే ఏ2 విజయసాయిరెడ్డిలా ఫోన్లు పారేసుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అసలు ఈ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రేమచంద్రారెడ్డిని ఇప్పటి వరకు సీఐడీ విచారించలేదు. జగన్‌ సామాజికవర్గం అని ఆయన్ను వదిలేశారా? ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ, జగన్‌ చుట్టూ తిరుగుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అజయ్‌జైన్‌, రావత్‌లు.. గతంలో ఈ ప్రాజెక్టు మానిటరింగ్‌ కమిటీ, సెలక్షన్‌ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. వారినీ విచారించలేదు. శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ ఇచ్చిన ఫోరెన్సిక్‌ రిపోర్టులో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో తాము భౌతికంగా తనిఖీలు చేయలేదని చెప్పింది నిజం కాదా? అలాంటప్పుడు ఈ ప్రాజెక్టంతా బోగస్‌ అని ఎలా చెబుతారు? సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్స్‌ సంస్థ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,300 కోట్లు ఖర్చవుతుందని తమ నివేదికలో పేర్కొన్నది వాస్తవం కాదా?...’’ అని పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

ట్రిబుల్‌ ఐటీ డైరెక్టరే బాగున్నాయన్నారు

జగన్‌ సొంత జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ ‘సీమెన్స్‌ సంస్థ’ ఇచ్చిన పరికరాలు బాగా పనిచేస్తున్నాయని 2021 ఆగస్టులో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు లేఖ రాశారని పట్టాభిరామ్‌ గుర్తు చేశారు. ‘గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు తమకు అధునాతన పరికరాలు అందినట్లు సంబంధిత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు లేఖలు రాశాయి. పరికరాల పనితీరు బాగుందని పేర్కొన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా 2021 డిసెంబరులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం కుట్ర కాదా? అసలు ఆయా కేంద్రాల్లో ఏయే పరికరాలు ఉన్నాయో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసా? ఆర్థికపరమైన అంశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదవడంతోనే అదనపు సమాచారం కోసం ఈడీ నోటీసులు ఇచ్చింది కానీ... ఈడీ విచారణ అనేదే లేదు...’’ అని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని