కొత్త ఉద్యోగాల్లేవు...ఉన్నవారినీ తొలగిస్తారా?: నాదెండ్ల మనోహర్‌

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి 2.50లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అలాంటిది అరకొర ఖాళీలు చూపించి అవి కూడా భర్తీ చేయకుండా యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది’’ అని నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో నిలదీశారు.

Updated : 06 Dec 2022 06:24 IST

ఈనాడు-అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి 2.50లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అలాంటిది అరకొర ఖాళీలు చూపించి అవి కూడా భర్తీ చేయకుండా యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు ఏళ్ల తరబడి కొద్దిపాటి జీతాలకు పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సీఎం జగన్‌ ఎలా సమర్థించుకుంటారు?...’’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో నిలదీశారు. అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు తమకు తెలియదని, అధికారులు వాటిని ఇచ్చారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూస్తున్న యువతకు అవి అందకపోగా 2.50 లక్షల మంది పొరుగుసేవల ఉద్యోగులను ఇంటికి పంపేస్తారనేది అశనిపాతంగా మారిందని చెప్పారు. చిన్నపాటి ఉద్యోగాలే ఇవ్వలేని ప్రభుత్వం ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇస్తుందని యువత ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడిందని మనోహర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదని, ఉపాధినిచ్చే పరిశ్రమలను ప్రోత్సహించదని, ఉన్న పరిశ్రమలు తమ కొత్త ప్రాజెక్టులను, అనుబంధ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పేందుకు సుముఖంగా లేని పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటే వైకాపా పాలన ఎలా ఉందో అవగతం చేసుకోవాలన్నారు. పొరుగు సేవల ఉద్యోగులను తొలగించేందుకు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ముఖ్యమంత్రే స్వయంగా వివరణ ఇవ్వాలని మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని