అరెస్ట్‌ తప్పించుకోవడానికే కవిత డ్రామాలు

మద్యం కేసులో సీబీఐ విచారణకు వెళ్తే తనను అరెస్టు చేస్తారేమోనని తెరాస ఎమ్మెల్సీ కవిత భయపడుతున్నారని భారతీయ జనతాపార్టీ (భాజపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 06 Dec 2022 08:29 IST

సానుభూతి కోసం తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు కుట్ర
ప్రజా సంగ్రామయాత్రలో బండి సంజయ్‌ ఆరోపణ

నిర్మల్‌, న్యూస్‌టుడే: మద్యం కేసులో సీబీఐ విచారణకు వెళ్తే తనను అరెస్టు చేస్తారేమోనని తెరాస ఎమ్మెల్సీ కవిత భయపడుతున్నారని భారతీయ జనతాపార్టీ (భాజపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అందుకే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి కొత్త డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. అరెస్టయితే సానుభూతి పొందేందుకు, తెలంగాణ సెంటిమెంటు రగిలించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా రత్నాపూర్‌ కాండ్లి శివార్లలో బసచేసిన బండి సంజయ్‌ వద్దకు సోమవారం ఉదయం బాసరలోని వేదభారతి విద్యాలయ విద్యార్థులు వచ్చి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించి లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌, మామడల్లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులకు దమ్ముంటే.. డ్రగ్స్‌, క్యాసినో, లిక్కర్‌ దందాలో విచారణకు హాజరై నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ సర్కార్‌ను కూల్చి, భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎవరన్నారు. తెలంగాణ ప్రజల ఆశలను కూల్చింది కేసీఆరేనని, ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా అంటూ మండిపడ్డారు. ఎంపీ సోయం బాపురావు గాలిలో గెలిచారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. పేదలను హింసించిన భూకబ్జాదారులు, అవినీతిపరులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అంతు చూస్తామని హెచ్చరించారు. నిర్మల్‌లో భూకబ్జాలు చేసి కట్టుకున్న భవంతులను బుల్డోజర్లతో కూల్చివేయిస్తామని స్పష్టం చేశారు. కొండగట్టు మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, నష్టపరిహారం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పి నాలుగేళ్లయిందన్నారు. ఇప్పటికైనా హామీని నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని