భారాసకు ప్రైవేటు ఉద్యోగ సంఘాల మద్దతు

తెరాస స్థానంలో ఏర్పాటవుతున్న జాతీయ పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)కి దక్షిణ భారత రాష్ట్రాల ప్రైవేటు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Published : 06 Dec 2022 05:15 IST

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌తో నేతల భేటీ 

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస స్థానంలో ఏర్పాటవుతున్న జాతీయ పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)కి దక్షిణ భారత రాష్ట్రాల ప్రైవేటు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు చెందిన నేతలు రాజశేఖర్‌, కమల్‌నాథ్‌, గణేషన్‌, రామచంద్ర పిళ్లై, శ్రీనివాసన్‌ తదితరులు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ విధానాలతో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్రోధరల పెంపు కారణంగా పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని ప్రధాని నరేంద్రమోదీ పూర్తిగా విస్మరించారని, దేశంలో నిరుద్యోగం ప్రబలుతోందని చెప్పారు. రైతు వ్యతిరేక విధానాలు దేశానికి శాపంగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ వెంటే ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఉంటారని తెలిపారు. కేసీఆర్‌ చేసే ధర్మపోరాటానికి దేశంలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు సంఘీభావంగా కలిసి వస్తారని గంధం రాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని