క్యూలో నిల్చొని ఓటువేసిన ప్రధాని

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ (99), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Updated : 06 Dec 2022 06:20 IST

ఓటు హక్కును వినియోగించుకున్న హీరాబెన్‌, అమిత్‌షా
పోలింగ్‌ కేంద్రం వద్ద మోదీ రోడ్‌షో చేశారు: కాంగ్రెస్‌

అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ (99), కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. సోమవారం అహ్మదాబాద్‌లోని రాణిప్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని ఓటేశారు. వాహనశ్రేణిని కొంతదూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్‌ కేంద్రం వరకు ఆయన వెళ్లారు. దారిపొడవునా ఉన్నవారికి ఆయన అభివాదం చేశారు. కొంతసేపు క్యూలో నిల్చొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పెద్దఎత్తున పాల్గొనాలని అంతకుముందు ట్విటర్‌ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. అబ్బురపరిచే రీతిలో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రపంచంలో మనదేశ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను ఈసీ పెంపొందిస్తోందని ఆయన అభినందించారు.

నియమావళిని ఉల్లంఘించారు: కాంగ్రెస్‌

పోలింగ్‌ కేంద్రానికి మోదీ నడుచుకుంటూ వెళ్లి ‘రోడ్‌ షో’ చేపట్టడం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ‘‘ఓటెయ్యడానికి వెళ్లిన ప్రధాని రెండున్నర గంటల పాటు రోడ్‌ షో చేపట్టారు. దీన్ని అన్ని ఛానళ్లు ఉచితంగా చూపించాయి. ఇది ప్రచారం కాదా? రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ, ఎన్నికల సంఘం అన్నీ ఒక్కటైపోయినట్లు కన్పిస్తున్నాయి. మోదీ రోడ్‌షోపై ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ద్వారా ఇష్టపూర్వకంగానే ఒత్తిడికి తలొగ్గినట్లు కన్పిస్తోంది’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల రోజున రోడ్‌షోలపై నిషేధం ఉంటుంది. కానీ వారు (భాజపా, మోదీని ఉద్దేశిస్తూ) ప్రత్యేక వ్యక్తులు కదా..! వీవీఐపీలు ఏదైనా చేయగలరు’’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆరోపణలను భాజపా నేతలు తిప్పికొట్టారు. ‘‘మోదీ కాన్వాయ్‌ను పోలింగ్‌ కేంద్రానికి కొద్ది దూరంలో నిలపాల్సి వచ్చింది. అందుకే ప్రధాని నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. పోలింగ్‌ కేంద్రం లోపలికి వాహనాన్ని తీసుకెళ్లలేం కదా? కాంగ్రెస్‌ కావాలనే రెచ్చగొడుతోంది’’ అని భాజపా నేతలు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

విశ్రాంతి కూడా తీసుకోవాలని మోదీకి అన్నయ్య సూచన

ఓటు వేసిన తర్వాత మోదీ అక్కడికి సమీపంలోనే ఉన్న తన పెద్దన్నయ్య సోమాభాయ్‌ నివాసానికి కాలినడకన వెళ్లారు. తర్వాత సోమా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ- ప్రధాని తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘విరామం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న నేపథ్యంలో కాస్త విశ్రాంతి కూడా తీసుకోవాలని సోదరుడి (ప్రధాని)ని కోరాను’ అని వెల్లడించారు.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

గుజరాత్‌లో 93 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్‌లో 61% మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారని ప్రాథమిక లెక్కల ప్రకారం అధికారులు ప్రకటించారు. తుది వివరాలు అందేసరికి ఇది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 2017లో ఈ నియోజకవర్గాల్లో 69.99 శాతం పోలింగ్‌ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ఈసారి అంతా ప్రశాంతంగానే ముగిసిందని ఈసీ అధికారులు ప్రకటించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, ఓటు రసీదు యంత్రాలు సరిగా పనిచేయలేదనే ఫిర్యాదులు కొన్నిచోట్ల నుంచి వచ్చాయి. కొన్ని గ్రామాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. క్రికెటర్‌ సోదరులు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌లు వడోదరాలో ఓట్లు వేశారు. 110 ఏళ్ల వయసులోనూ ఓటు వేసిన మెహ్‌సాణా జిల్లా ఓటరు శాంతాబెన్‌ను గుజరాత్‌ ఎన్నికల ప్రధానాధికారి పి.భారతి అభినందించారు. ఓట్ల లెక్కింపు గురువారం జరగనున్న విషయం విదితమే.

మిగిలిన రాష్ట్రాల్లో..

యూపీలోని మైన్‌పురి లోక్‌సభ స్థానానికి, ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ కూడా సోమవారం సాయంత్రం ముగిసింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓట్లు వేయకుండా పోలీసులు, ఇతర అధికారులు కొన్నిచోట్ల ఓటర్లను అడ్డుకున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని