100% గెలుపు తెదేపాదే

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయం 100% ఖాయం అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

Updated : 07 Dec 2022 07:06 IST

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నాం
సీఎం జగన్‌ కక్షసాధింపు ధోరణితో విధ్వంస పాలన
జాతీయ రాజకీయాలకన్నా.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
ఇష్టాగోష్ఠిలో తెదేపా అధినేత

ఈనాడు, దిల్లీ: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయం 100% ఖాయం అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జి-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకొచ్చిన ఆయన మంగళవారం ఇక్కడ విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి కక్షసాధింపు ధోరణితో పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, అందుకే ప్రజలు ఆ పాలన పట్ల విసుగెత్తిపోయి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తాను నిర్వహిస్తున్న రోడ్‌షోలకు వస్తున్న ప్రజాస్పందన ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోందని విశ్లేషించారు. ‘గతంలో ప్రభుత్వాలు మారినా విధానాలను కొనసాగించే వారు. అందువల్ల రాష్ట్రాభివృద్ధి నిరంతరం కొనసాగేది. కానీ ప్రస్తుత సీఎం ఇదివరకు ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా గత ప్రభుత్వం తలపెట్టిన పోలవరాన్ని, అమరావతిని ఆపేసి రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మేం రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజల ముందుకు వెళ్లబోతున్నాం. నాకు ఇప్పుడు జాతీయ రాజకీయాలకంటే... రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం....’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్నికలు రేపొచ్చినా మేం సిద్ధం

ప్రజా వ్యతిరేకతకు భయపడి జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వస్తున్న వార్తల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ ... ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమేం. రేపొచ్చినా మేం సదాసిద్ధంగా ఉన్నాం. ఎన్నికల్లో డబ్బు ప్రభావం కొంతవరకే ఉంటుంది. ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా పనిచేయదు..’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రభుత్వంలో జరుగుతున్నంత వేధింపులు గతంలో ఎన్నడూ చూడలేదు. ఓడిపోతామన్న భయంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఎన్నికల సమయంలో హింసకు తెగబడతారన్నది తెలుసు. ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న వారు ఎంత హింసకు పాల్పడితే ప్రజల నుంచి అంత రెట్టింపు ప్రతిఘటన వస్తుంది...’ అని చంద్రబాబు చెప్పారు. ‘హైదరాబాద్‌ నగరాభివృద్ధికి నేను వేసిన విత్తులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. ఒక పబ్లిక్‌ పాలసీతో హైదరాబాద్‌ రూపురేఖలను మార్చి దాన్ని రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా తయారుచేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్లడం వల్ల మహానగరం మరింత అభివృద్ధి చెందింది. ప్రస్తుత కేసీఆర్‌ ప్రభుత్వం ఇది వరకు మా హయాంలో కట్టిన ఫ్లైఓవర్లకు కొనసాగింపుగా మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తూపోవడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తగ్గింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ తరహాలో దేశంలో ఏ మహానగరమూ అభివృద్ధి చెందలేదు. తొలి ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్‌కు పేరున్నా అది కేవలం పరిపాలనా నగరంగానే పరిమితమైంది. హైదరాబాద్‌ తరహాలో బహుముఖ వ్యూహంలో అభివృద్ధి చెందలేదు. హైదరాబాద్‌లాంటి గ్రోత్‌ ఇంజిన్‌లా అమరావతిని చేయాలనుకున్నాను. గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆ లక్ష్యం నెరవేరలేదు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

నేడు 3%కి పడిపోయిన రాష్ట్ర వృద్ధి రేటు

ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన అయిదేళ్ల హయాంలో రాష్ట్రం సగటున 10.8% వృద్ధిరేటు నమోదు చేయడం కూడా ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర వృద్ధి రేటు 3%కి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చేయడం వల్ల యువత దాన్ని అందిపుచ్చుకొని విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం దాదాపు 30% మంది యువత విభిన్న దేశాల్లో ఉద్యోగాలు చేస్తోంది. ఆ మేరకు స్థానికంగా తెదేపా ఓటర్లను కోల్పోవాల్సి వచ్చిందని’ ఆయన నవ్వుతూ చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలకు ఓటింగ్‌ కల్పించడానికి తాము మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో తెదేపా కార్యక్రమాలు నిర్వహించగలగడానికి కారణం ఇక్కడి యువత ఉద్యోగ వేటలో వెళ్లి అక్కడ స్థిరపడటమేనన్నారు. తెలంగాణలో బలపడటానికి ప్రయత్నిస్తున్నామని, అందుకే అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.

దేశ జనాభా పెరగాలి

2047 నాటికి దేశ జనాభా సగటు వయోభారం పెరిగే ప్రమాదం ఉన్నందున నియంత్రణ ఎత్తేసి జనాభా పెరుగుదలకు అవకాశం కల్పించాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి తగ్గడం వల్ల దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ వృద్ధాప్యం ముందుగా వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మనమూ జపాన్‌ తరహాలో వృద్ధాప్య భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్య శాశ్వతంగా ఉండకూడదనుకుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రణాళిక చేసుకోవాలి. వచ్చే 25 ఏళ్ల వరకు మనకు వయోభారం సమస్య ఉండదు. ఆ తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించుకోవాలి. జనాభా పెరుగుదల భవిష్యత్తులో వరం అవుతుంది తప్పితే శాపం కాదు. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థ పెద్దగా లేని కాలంలో జనాభా పెరుగుదల పేదరికానికి దారి తీసేది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సంపద సృష్టికి పునాది అవుతుంది...’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు