జగన్‌రెడ్డి పెట్టిన బీసీ కార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికీ పనికిరావు

ముఖ్యమంత్రి జగన్‌ ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. వీటి ద్వారా మూడున్నరేళ్ల కాలంలో ఒక్క బీసీకి న్యాయం చేయలేదని మండిపడ్డారు.

Updated : 07 Dec 2022 10:08 IST

ఒక్క బీసీకి న్యాయం చేయలేదు
జరిగేది బీసీ ద్రోహుల భజన సభ
తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. వీటి ద్వారా మూడున్నరేళ్ల కాలంలో ఒక్క బీసీకి న్యాయం చేయలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి 16,800 పదవులు అందకుండా చేసి రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.38 వేల కోట్లు కేటాయించి రూ.32 కోట్లు ఖర్చు పెట్టిందని, మరి జగన్‌రెడ్డి బీసీలకు ప్రత్యేకంగా ఖర్చు చేసిందెంతో చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి పెడుతున్న జయహో బీసీ సభ కాదని... బీసీ ద్రోహుల భజన సభ అని మండిపడ్డారు. జగన్‌రెడ్డి బీసీలకు చేసిన దగా, ద్రోహాన్ని నిరసిస్తూ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధావెంకన్న, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

4.7 లక్షల మందికే సాయం చేశారు: అచ్చెన్నాయుడు

తెదేపా అంటేనే బీసీలు....బీసీలంటేనే తెదేపా. జగన్‌రెడ్డి 139 కులాల పరిధిలో 2.14 కోట్ల బీసీలు ఉంటే 4.7 లక్షల మందికి అరకొరగా సాయం అందించారు. మిగతా వారంతా బీసీలు కాదా? లేదా వారు తన పార్టీ వారు కాదని ఆయన విస్మరించారా? తెదేపా ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్ల ద్వారా 3.75 లక్షల మందికి రూ.లక్ష సబ్సిడీతో రుణాలిచ్చాం. రూ.2 లక్షల రుణాలిచ్చి స్వయం ఉపాధి కల్పించాం. ఫెడరేషన్ల ద్వారా 75 వేల సంఘాలకు రుణాలిచ్చి చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు దిశగా బలహీనవర్గాలను ప్రోత్సహించాం. మూడున్నరేళ్ల తన పాలనలో జగన్‌రెడ్డి ఒక్క బీసీకి, ఒక్క పైసా రుణమైనా ఇచ్చారా? ఒక్కరికైనా స్వయం ఉపాధి కల్పించారా? చంద్రబాబు బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టి రూ.34 వేల కోట్లు నిధులిస్తే జగన్‌ అధికారంలోకి రాగానే వాటిని మళ్లించారు. బీసీలను దారికి తెచ్చుకోవడానికే తెదేపాకు చెందిన బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంపై సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సామంతరాజులను పెట్టి పెత్తనం చేస్తుంటే... బీసీ మంత్రులు నోరెత్తలేని స్థితిలో ఉన్నారు. రెడ్లకు పెత్తనమిచ్చిన జగన్‌....బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది.

నిధులు లేని స్థానాల్లో బీసీలా?: అయ్యన్న

ఎన్టీఆర్‌, చంద్రబాబు బీసీలను నాయకుల్ని చేస్తే...జగన్‌రెడ్డి పదవులన్నీ రెడ్లకు కట్టబెట్టి... పనికిమాలిన, నిధులు, విధులు లేని స్థానాల్లో బీసీలను నియమించారు. తితిదేలో, యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్లలో ఎంత మంది బీసీలున్నారు? పరిపాలించడం చేతగాని వ్యక్తికి 54 మంది సలహాదారులా? వైఎస్‌ భారతికి ప్యాలస్‌ కట్టడానికి రుషికొండను ఒక బొడిగుండు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల్ని తన్నుకునేలా చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్రను విజయసాయికి అప్పగించి దోచేస్తున్నారు. రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు కొట్టేస్తున్నారు.

రాజకీయంగా పైకి తెచ్చింది తెదేపానే: కళా

మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పాలన చేరువ చేయడం ద్వారా తెదేపా బీసీలను రాజకీయంగా ఎదిగేలా చేసింది. మహిళా రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. మండల కమిషన్‌ ఏర్పాటు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం, బీసీ ఆర్థిక సంస్థ ఏర్పాటు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసింది.

కట్టుబానిసల్లా చూస్తారా?: కొల్లు రవీంద్ర

జగన్‌రెడ్డి బీసీలను కట్టుబానిసల్లాగా చూస్తున్నారు. కల్లబొల్లిమాటలు చెప్పి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం బీసీలకు చేస్తున్న దగాను ఎండగట్టేందుకు 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని