విభజన హామీలు అమలు చేయాలని కోరాం

రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఏడాది కాలం మాత్రమే ఉన్నందున అందులో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ వెల్లడించారు.

Updated : 07 Dec 2022 06:21 IST

తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఏడాది కాలం మాత్రమే ఉన్నందున అందులో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరినట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం కనకమేడల విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి దగ్గర మెడలు వంచారని ఎద్దేవా చేశారు. ‘వైకాపా పాలన తీరుతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. శాంతిభద్రతలు కరవయ్యాయి. నిత్యం బాండ్లు అమ్ముతూ అప్పుల కోసం ఆర్‌బీఐని బతిమాలుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అఖిలపక్ష సమావేశంలో కోరాం. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ కర్నూలులో హైకోర్టులో పెట్టడం లేదని, అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పారు. మరోవైపు కర్నూలులో గర్జన సభ పెట్టి హైకోర్టు పెట్టాలని డిమాండ్‌ చేయడం ప్రజలను మోసగించడం కాదా? మాజీ అటార్నీ జనరల్‌ స్థాయి వ్యక్తి అబద్ధం చెప్పరు. ఆయన చెప్పినది అబద్ధం అయితే దానిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరాం....’ అని కనకమేడల పేర్కొన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారడం మాని శాంతిభద్రతలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెదేపా లోక్‌సభ పక్ష నేత రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌కు నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. దిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా లోక్‌సభ పక్ష నేత రామ్మోహన్‌ నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును కలిసిన ఫరూఖ్‌ అబ్దుల్లా

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్‌ అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ నివాసంలో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పరస్పర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు