సీబీఐ, ఈడీ దాడులపై ఆందోళన చేపడతాం: కేకే

సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు.

Published : 07 Dec 2022 05:30 IST

ఈనాడు, దిల్లీ: సమాఖ్య స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం, తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ, ప్రతిపక్షాలపై అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ దాడులపై పార్లమెంటులో ఆందోళన చేపడతామని తెలిపారు. 17 రోజులే సాగే శీతాకాల సమావేశాల్లో 25 బిల్లులు ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. ఈ సమావేశాల్లోనైనా ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ‘‘దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, బొగ్గు గనుల వేలంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో చర్చకు పట్టుపడతాం. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తాం. దేశీయ విద్యుత్‌ కంపెనీలు పది శాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలనే ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లు సహా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పంటలకు కనీస మద్దతు ధరపై చర్చ జరిపి చట్టం చేయాలి’’ అని కేశవరావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని