రాష్ట్రాల పాలనలో గవర్నర్ల జోక్యం తగదు!

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం తగదని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు.

Published : 07 Dec 2022 05:30 IST

అఖిలపక్ష సమావేశంలో తెరాస నేత నామా
ఈ వాదనకు టీఎంసీ, సీపీఎం మద్దతు

ఈనాడు, దిల్లీ: ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం తగదని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం’ అంశాన్ని తొలుత డీఎంకే పక్ష నేత టి.ఆర్‌.బాలు లేవనెత్తారు. దీనిపై నామా స్పందిస్తూ.. తెలంగాణలోనూ పాలన వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం అధికమైందని అన్నారు. గవర్నర్లు తమకు నిర్దేశించిన విధుల పరిధిని దాటుతున్నారన్నారు. నామా వాదనకు టీఎంసీ పక్ష నేత సుదీప్‌ బందోపాధ్యాయ, సీపీఎం పక్ష నేత నటరాజన్‌ మద్దతు పలికారు. గవర్నర్లు సమాంతర పాలన నడుపుతున్నారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ విషయంపై పార్లమెంటు లోపల, బయటా చర్చ జరగాలన్నారు.

*  తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిపి న్యాయం చేయాలని నామా కోరారు. పునర్విభజన చట్టంలోని కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం ఏర్పాటుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులపై కేంద్రం రకరకాల ఆంక్షలు విధించడం తగదన్నారు. గ్యాస్‌, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు, రైతు సమస్యలు, విద్యుత్‌ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, కుల గణన, రిజర్వేషన్లపై సమావేశాల్లో చర్చించాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు