ఎన్నికలొచ్చినప్పుడే దళితులు గుర్తొస్తారు!

ఎన్నికలొచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని.. పథకాలు ప్రవేశపెడతారని.. తర్వాత ఏవీ అమలు కావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 07 Dec 2022 05:30 IST

ప్రజాసంగ్రామ యాత్రలో కేసీఆర్‌పై బండి సంజయ్‌ విమర్శలు

నిర్మల్‌-మామడ, న్యూస్‌టుడే: ఎన్నికలొచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని.. పథకాలు ప్రవేశపెడతారని.. తర్వాత ఏవీ అమలు కావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన నిర్మల్‌ జిల్లా దిమ్మదుర్తిలో మంగళవారం పర్యటించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ఎంతో ప్రాధాన్యమున్న జీ-20 సదస్సు నిర్వహణపై సూచనలు, సలహాల కోసం ప్రధాని ఏర్పాటుచేసిన సన్నాహక సదస్సుకు కేసీఆర్‌ హాజరు కాలేదని.. మద్యం కేసులో ఇరుక్కున్న తన కుమార్తె కవితను కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ భారత రాజ్యాంగాన్ని మార్చి కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.. మనం ప్రశ్నించకపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేడ్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరైతే మన సీఎం దూరంగా ఉంటారు’’ అని సంజయ్‌ విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి... ‘‘నేను తినేది లవంగం.. తంబాకు తింటానని అంటుంటారు కదా.. నా రక్తం, ఇతర నమూనాలన్నీ ఇస్తాను. ఎక్కడైనా పరీక్ష చేయించండి. నా రక్తంలో తంబాకు ఉంటే నేను దేనికైనా సిద్ధం. కేవలం నీ రక్త నమూనా, రెండు వెంట్రుకలిస్తే చాలు.. నేను పరీక్ష చేయించి గుట్టురట్టు చేస్తా’’ అన్నారు. భాజపా పాలనలో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. యాత్రలో ఉత్సాహంగా కదిలిన సంజయ్‌ దిమ్మదిర్తి సమీపంలో తాటికల్లు తాగారు.

‘ముందస్తు’ యోచనలో ముఖ్యమంత్రి!

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పాదయాత్ర శిబిరం వద్ద వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఆయన మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మోర్చాలన్నీ క్రియాశీలకంగా ఉండాలని.. సమస్యలపై ఉద్యమించాలని సూచించారు.  పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు