CM Jagan: 16 నెలల్లో యుద్ధం

‘మరో 16, 18 నెలల్లో యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధం మంచి, చెడుల మధ్య.. నిజాయతీ, వెన్నుపోటుల మధ్య.. మాట మీద నిలబడే నాయకత్వానికి, వెన్నుపోటు మనస్తత్వానికి మధ్య.. సామాజిక న్యాయం, సామాజిక అన్యాయానికి మధ్య.. పేదల భవిష్యత్తుకు, వారు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 08 Dec 2022 07:35 IST

చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివి
ఒంటరిగా ఎదుర్కొంటానని ఆయనెందుకు చెప్పలేకపోతున్నారు?
బీసీలకు మూడున్నరేళ్లలో రూ.1.63 లక్షల కోట్లు ఇచ్చాం
82 వేలమందికి పదవులు ఇచ్చాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదల సంక్షేమమే వైకాపా విధానం
వైకాపా జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘మరో 16, 18 నెలల్లో యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధం మంచి, చెడుల మధ్య.. నిజాయతీ, వెన్నుపోటుల మధ్య.. మాట మీద నిలబడే నాయకత్వానికి, వెన్నుపోటు మనస్తత్వానికి మధ్య.. సామాజిక న్యాయం, సామాజిక అన్యాయానికి మధ్య.. పేదల భవిష్యత్తుకు, వారు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైకాపా ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ మహాసభలో ఆయన ప్రసంగించారు. ‘నా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే మరోవైపు బీసీల తోకలు కత్తిరిస్తా, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న చంద్రబాబు ఉన్నారు. తెదేపా సామాజిక అన్యాయ పార్టీ. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం వైకాపా. మూడున్నర దశాబ్దాలుగా బీసీలను చంద్రబాబు ఉపయోగించుకున్నారే తప్ప నాలాగ గుండెల్లో పెట్టుకోలేదు’ అని విమర్శించారు. ‘అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేశారు. మూడు రాజధానులంటే అరిచి గీపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాంటి మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదని ప్రజలకు చెప్పండి. 2024లోనూ వైకాపాకు ఇంతకుమించిన గెలుపు ఖాయమని, 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని గట్టిగా చెప్పండి’ అన్నారు.

మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు

‘మీ హృదయంలో జగన్‌.. జగన్‌ హృదయంలో మీరు.. ఇది ఎప్పటికీ మన అనుబంధం... బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, సమాజానికి వెన్నెముక కులాలని చాటే కార్యక్రమాలను ఈ మూడున్నరేళ్లలో చేపట్టా. ఈ మూడున్నరేళ్లలో 1.63 లక్షల కోట్లు ఖర్చుచేశాం. ఇందులో డీబీటీ కిందే రూ.86వేల కోట్లు ఇచ్చాం. వెన్నెముక కులాలుగా మార్చడమంటే ఇదీ అని సగర్వంగా తెలియజేస్తున్నా’ అన్నారు.

బీసీ డిక్లరేషన్‌ హామీలను అమలు చేశాం

‘2019 ఫిబ్రవరిలో ఏలూరులో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేశాం. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశాం. దేశంలో తొలిసారిగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను తెచ్చాం. రకరకాల పదవులు పొందిన సుమారు 82వేల మంది ఇక్కడకు రావడమే నిదర్శనం. చేదోడు ద్వారా రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు రూ.584 కోట్లు ఇచ్చాం. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు 26.40 లక్షల మందికి చేయూత కింద మూడున్నరేళ్లలో రూ.14,110 కోట్లు ఇవ్వగలిగాం. తిరుమల ఆలయంలో తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును సన్నిధి గొల్లలకు కల్పించాం. వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. మత్స్యకారులకు చంద్రబాబు రూ.4వేలిస్తే మనం రూ.10వేలకు పెంచి ఈ మూడేళ్లలో రూ.418 కోట్లు ఇచ్చాం. సొంత మగ్గం ఉన్న నేతన్నలకు ఏటా రూ.24వేల చొప్పున ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లు ఇచ్చాం’ అని వివరించారు.

అదే వైకాపా రాజకీయ విధానం

‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేదల సంక్షేమమే వైకాపా రాజకీయ విధానం. ఈ మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద అందించిన లబ్ధి అక్షరాలా రూ.3,18,228 కోట్లు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అందించిందే రూ.2.53 లక్షల కోట్లు. అంటే 80% వారికే’ అని వెల్లడించారు.

తేడా గమనించండి

‘చంద్రబాబు ప్రభుత్వ 2018-19 బడ్జెట్‌, ప్రస్తుత రాష్ట్రబడ్జెట్‌ దాదాపు ఒకటే. కానీ, అప్పట్లో ఈ పథకాలన్నీ లేవు. కారణం వారిదంతా దోచుకో, తినుకో పంచుకో విధానం. కానీ, ఇప్పుడు బటన్‌ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి సాయం చేరుతోంది. ఎక్కడా జన్మభూమి లాంటి మధ్యదళారీ కమిటీలు లేవు. ఈ తేడాను గమనించాలని కోరుతున్నా’ అని తెలిపారు.

జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొంటానని బాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?

‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లవుతోంది. మరి మీ బిడ్డ వయసు 49 సంవత్సరాలు. ఈ పెద్దమనిషి మన ప్రభుత్వం మీద 2024లో ఒంటరి పోరాటం చేస్తానని చెప్పడం లేదు. జగన్‌ను ఒంటరిగానే ఎదుర్కొంటానని చెప్పలేకపోతున్నారెందుకు?’ అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు చెప్పండి

‘బీసీలంటే కుట్టుమిషన్లు, షేవింగ్‌ కిట్లు, ఇస్త్రీపెట్టెలు కాదని చంద్రబాబుకు బీసీలంతా చెప్పండి. 2014లో బీసీలకు 114 వాగ్దానాలనిచ్చి 10% కూడా అమలుచేయని ఆ చంద్రబాబుకు చెప్పండి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకున్న జగన్‌కు వెన్నెముకగా మారామని.. రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములం, ఈ ప్రభుత్వం మాది, మనందరిదీ అని చెప్పండి. బీసీ ఉప ప్రణాళికలో రూ.10వేలకోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.50వేల కోట్లను ఖర్చుపెడతానన్న చంద్రబాబు కనీసం రూ.20వేల కోట్లు కూడా పెట్టకుండా మోసగించారు’ అని సీఎం ఆరోపించారు.

చంద్రబాబు పెత్తందారీ తోకను కత్తిరించే కత్తెర్లు

‘చంద్రబాబు పెత్తందారీ తోకను కత్తిరించే అధికార కత్తెర్లను ప్రతి అడుగులోనూ కనిపించేలా చేస్తున్నాం. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి రాజ్యసభ సభ్యత్వం వరకు 82వేల మంది పైచిలుకు బీసీలకు రకరకాల పదవులనివ్వగలిగాం. మంత్రిమండలిలో 70%, రాజ్యసభకు నలుగురు, శాసనమండలికి 18మందిని, స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌లాంటి అత్యున్నత పదవులను వారికే ఇచ్చాం. 648 మండలాల్లో 237 ఎంపీపీ పదవులను, 13మంది జెడ్పీ ఛైర్మన్లలో 6 పదవులను, 14 మేయర్లలో 9 పదవులను, 84 మున్సిపల్‌ చైర్మన్లలో 44 పదవులను బీసీలకు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30లక్షల మంది ఉద్యోగుల్లో 84% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. 2.60లక్షల మంది వాలంటీర్లలో 83% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ఇదీ జయహో బీసీ అంటే.. రాజకీయంగా వెన్నెముక కులాలుగా బీసీలను మార్చడమంటే ఇదీ’ అని వ్యాఖ్యానించారు.

175 స్థానాలే లక్ష్యంగా మీరూ గడప గడపకూ తిరగాలి

‘ఇప్పటినుంచి మీరూ గడప గడపకూ వెళ్లాలి. ప్రతి 50 ఇళ్లనూ మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి. బూత్‌ కమిటీలనూ ఏర్పాటుచేయాలి. మన లక్ష్యం 175కి 175 అని గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్‌కు తోడుగా ఉండండి.. మంచి జరగకపోతే వద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మవద్దు, ఎన్నికలప్పుడు రంగుల కలలు చూపిస్తారు. పిల్లలను విదేశాల్లో చదివిస్తానంటారు. కానీ, ఆయన్ను నమ్మవద్దని, ఒకసారి నమ్మితే రాష్ట్రం అడుగులు వెనక్కి పడ్డాయని, జగన్‌ను ఒకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే మన బతుకులు మారాయా లేదా అని చెప్పండి’ అని సీఎం సూచించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు