మంత్రులు, ఎమ్మెల్యేలకు కమీషన్లు ఇస్తేనే పనులు

వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. రాష్ట్రంలో కులాలకతీతంగా 80శాతం ఉన్న హిందువులు ఏకతాటిపై నిలిస్తే భాజపా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

Updated : 08 Dec 2022 08:54 IST

లేదంటే ఆగిపోతున్నాయ్‌
ఖానాపూర్‌ సభలో బండి సంజయ్‌

ఈటీవీ-ఆదిలాబాద్‌: వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. రాష్ట్రంలో కులాలకతీతంగా 80శాతం ఉన్న హిందువులు ఏకతాటిపై నిలిస్తే భాజపా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని ఎన్టీఆర్‌ చౌక్‌లో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలకు కమీషన్లు ఇవ్వందే పనులు జరగవు. ప్రభుత్వ పథకాల అమలులో వాటాలు వసూలు చేస్తున్నారు. ముడుపులు ముట్టచెబితేనే పనులు జరుగుతున్నాయి. లేనట్లయితే ఆగిపోతున్నాయి’ అని ఆరోపించారు. దిల్లీ మద్యం కేసులో ఈనెల 11న ఎమ్మెల్సీ కవిత సంగతేంటో తేలిపోతుందని అన్నారు.  ఉద్యోగాలు లేక యువత గల్ఫ్‌ బాట పడుతోందని సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ మొదలుకొని హమాలీలకు చెల్లించే రూపాయి వరకు ప్రధాని మోదీ ఇస్తున్నారని చెప్పారు. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని, మరోసారి తెరాసకు అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేద్దామా అని ప్రజలను ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి రాగానే బెంగళూరు డ్రగ్స్‌ కేసు, నయీం కేసులను తిరగదోడతామని పునరుద్ఘాటించారు. కుప్టీ ప్రాజెక్టు, సదర్మాట్‌ కాలువ, ఖానాపూర్‌లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుచేసే బాధ్యత తనదని చెప్పారు. నిర్మల్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ సోయం బాపురావు, నేతలు వివేక్‌ వెంకటస్వామి, రమేష్‌ రాథోడ్‌, అజ్మీర హరినాయక్‌, జానూబాయి, సట్ల అశోక్‌, రితేష్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం వాఖ్యలపై ధ్వజం..

‘‘సీఎం కేసీఆర్‌... జగిత్యాలలో బుధవారం నిర్వహించిన సభలో గోల్‌మాల్‌ గోవిందం అంటూ ఏదేదో మాట్లాడారట. నీ సంగతేంటో తేలుస్తాం. బాసర, వేములవాడలకు ఇస్తానన్న నిధులు ఏమయ్యాయ్‌? ఇప్పుడు కొండగట్టు అంజన్నకు వంద కోట్లు ఇస్తానంటూ అంజన్నను కూడా మోసం చేస్తావా’’ అంటూ బండి సంజయ్‌ ఖానాపూర్‌ మండలం బాదన్‌కుర్తిలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

* నిర్మల్‌ జిల్లాలో పదిరోజులపాటు 110 కి.మీ. మేర సంజయ్‌ పాదయాత్ర జరిగింది. ఖానాపూర్‌ సాయిబాబా ఆలయం వరకు 100 కి.మీ.పూర్తైన సందర్భంగా బంతిపూలతో ముగ్గులు వేశారు. గురువారం జగిత్యాల జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుంది.

* నిర్మల్‌ జిల్లా తెరాసకు చెందిన పెంబి మండలాధ్యక్షురాలు భుక్యా కవిత, ఆమె భర్త రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు గోవింద్‌ సహా పలువురు సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు.


15న పాదయాత్ర ముగింపు
కరీంనగర్‌ సభకు జేపీ నడ్డా రాక

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభను ఈ నెల 16కు బదులుగా 15వ తేదీన నిర్వహించనున్నట్లు యాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి ప్రకటించారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా వస్తున్నారని చెప్పారు. ఇతర అత్యవసర కార్యక్రమాల్లో నడ్డా పాల్గొనాల్సి ఉన్నందున ఈ నెల 16న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ తేదీ మార్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు