పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదు

విపక్ష సభ్యుల్ని పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదనీ, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్దేశించిన వ్యవస్థల్ని భాజపా, ఆరెస్సెస్‌ అణచివేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Published : 08 Dec 2022 05:36 IST

ప్రజాస్వామ్య పరిరక్షణ వ్యవస్థల్ని అణచివేస్తున్నారు

మీడియాపైనా కేంద్ర సర్కారు ఒత్తిళ్లు: రాహుల్‌

కోటా (రాజస్థాన్‌): విపక్ష సభ్యుల్ని పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదనీ, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్దేశించిన వ్యవస్థల్ని భాజపా, ఆరెస్సెస్‌ అణచివేస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాజస్థాన్‌లో భారత్‌ జోడో పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన బుధవారం కోటా సమీపంలో ఒక సభలో ప్రసంగించారు. ‘‘పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ బిల్లులు, చైనా దురాక్రమణలు వంటి ఏ అంశంపైనా మమ్మల్ని మాట్లాడనివ్వరు. మేం ఎంతగా అరిచినా కెమెరాలు మమ్మల్ని చూపించవు. కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్‌ ఓంబిర్లానే లోక్‌సభ టీవీ ఇష్టపడుతుంది. 24 గంటలూ ఆయన్నే చూపిస్తుంది. లోక్‌సభలో మేం చెప్పేది ఎవరూ వినరు. అందుకే నేరుగా రోడ్లపైకి వచ్చి, ప్రజలతో మాట్లాడడమే ఏకైక మార్గంగా తోచింది’’ అని వివరించారు. ప్రసార మాధ్యమాలపైనా కేంద్రం ఒత్తిడి ఉంటోందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా మన దగ్గర పెట్రోలు, డీజిల్‌ ధరలు కిందికి రావడం లేదనీ, ఆ డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. కావాల్సిన వారికి క్షణాల్లో రుణమాఫీని చేసే ప్రభుత్వం.. రైతు రుణాల విషయంలో మాత్రం అలా చేయడం లేదని విమర్శించారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. 10 కి.మీ. దూరం నడిచాక ఆయన ఒక కార్యకర్త ఇంటికి వెళ్లి, బెల్లం టీ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగి సేవించారు. రుచిగా ఉందని మెచ్చుకున్నారు. ఆయన యాత్ర 2,400 కి.మీ. పూర్తి చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని