గెలుపుపై ఎవరి అంచనాలు వారివే
తమకు కంచుకోట లాంటి గుజరాత్‌లో కమలనాథులు మళ్లీ విజయనాదం చేస్తారా? వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని చరిత్ర సృష్టిస్తారా? హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం.
అహ్మదాబాద్, దిల్లీ : తమకు కంచుకోట లాంటి గుజరాత్‌లో కమలనాథులు మళ్లీ విజయనాదం చేస్తారా? వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొని చరిత్ర సృష్టిస్తారా? హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం మారే సంప్రదాయం కొనసాగుతుందా? లేక ఆ ఒరవడికి, కాంగ్రెస్ ఆశలకు తెరదించుతూ భాజపా రికార్డు బద్దలుకొడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని గంటల్లో సమాధానాలు రాబోతున్నాయ్!
గురువారం వెలువడనున్న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే భాజపా, ఆప్, కాంగ్రెస్‌లు గెలుపు తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
గుజరాత్: భాజపా హవా కొనసాగేనా!
గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఇక్కడి ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలో ఆయన 30 ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ దఫా కూడా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగితే.. మూడోసారి ప్రధానిగా ఆయన అభ్యర్థిత్వానికి మరింత బలం చేకూరినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాదాపుగా రెండు నెలలపాటు గుజరాత్‌లోనే ఉండి.. ప్రచార సరళిని పర్యవేక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఈసారి ‘నిశ్శబ్ద ప్రచారం’ నిర్వహించింది. జాతీయ స్థాయిలో భాజపాకు గట్టి పోటీదారుగా నిలవాలని భావిస్తున్న ఆప్.. గుజరాత్‌లో దూకుడు ప్రదర్శించింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు నేతలు.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో వివరించారు. గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటే.. మన దేశంలో సీపీఎం తర్వాత ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఏకైక పార్టీగా భాజపా రికార్డు సృష్టిస్తుంది. సీపీఎం పశ్చిమ బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లపాటు (1977 నుంచి 2011 వరకు) పాలించింది.
హిమాచల్: మారేది ప్రభుత్వమా? సంప్రదాయమా?
హిమాచల్‌లో 1985 తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈసారి ఆ సంప్రదాయానికి ముగింపు పలకాలని అధికార భాజపా గట్టి పట్టుదలను ప్రదర్శించింది. ‘ప్రభుత్వాన్ని కాదు.. సంప్రదాయాన్ని మారుద్దాం’ అనే నినాదంతో ప్రచారం నిర్వహించింది. యువత, మహిళల ఓట్లు తమకు కలిసొస్తాయని.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తామని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోదీ పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. మరోవైపు- హిమాచల్ ఫలితాలు కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మాత్రమే సొంతంగా అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాలకూ వచ్చే ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక సమరం కూడా సమీపిస్తోంది. ఈ పరిస్థితుల్లో హిమాచల్ ఎన్నికలతో విజయాల బాట పట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే రాష్ట్రంలో కమలదళానిదే ఈ దఫా కాస్త పైచేయి అవుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆప్ ప్రభావం నామమాత్రమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్‌కు ఆశాజనకమా..ఆశాభంగమా?
కొన్నేళ్లుగా ఓటర్ల మనసు గెలుచుకోలేక వరుస ఓటములను చవిచూస్తోన్న కాంగ్రెస్ గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట అధికారంలోకి వచ్చినా...క్షీణిస్తున్న ప్రాభవానికి అడ్డుకట్టపడినట్లే. గుజరాత్‌లో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎటూ కనిపించడంలేదు. కనీసం గతంలో మాదిరిగా ప్రతిపక్ష స్థానాన్ని నిలబెట్టుకున్నా పరువు దక్కినట్లే. అలాకాకుండా ఆ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పగించాల్సి వస్తే...అది కాంగ్రెస్‌కు శరాఘాతమే అవుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత మూడు దశాబ్దాలుగా వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం అప్పగించని హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపాను ఓడించి గెలుపు సాధించడంపై కాంగ్రెస్ ఆశలుపెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తే..సంస్థాగతంగా ఇప్పటికే ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. గుజరాత్‌లో విపక్ష స్థానాన్ని కోల్పోయి, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే...2024లో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లభించాల్సిన గౌరవప్రదమైన స్థానం దక్కకపోవచ్చు. అదే జరిగితే ప్రాంతీయ పార్టీలతో బేరసారాలాడే స్థాయినీ కోల్పోతోంది. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 250 వార్డుల్లో కాంగ్రెస్ కేవలం 9 స్థానాలను దక్కించుకుని మూడో స్థానానికి పరిమితం కావడం....దేశ రాజధానిలో ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని తెలియజేస్తోంది. ఈ పరిస్థితుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో విజయం సాధించడం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం. అక్కడి గెలుపు ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో హస్తం శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. గుజరాత్‌లో 50-60 స్థానాల్లో అభ్యర్థులను గెలుచుకున్నా ఆ పార్టీ పరువు కొంత మేరకైనా నిలిచే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
-
Politics News
Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్ గాంధీ
-
Movies News
Siddharth: నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.. ‘ఇండియన్2’ పై సూపర్ న్యూస్ చెప్పిన సిద్దార్థ్
-
India News
Uttarakhand: కొండచరియల బీభత్సం.. చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు
-
Politics News
YSRCP: కర్రసాము చేస్తూ కిందపడిన వైకాపా ఎమ్మెల్యే
-
Crime News
Kamareddy: ఆపరేషన్ థియేటర్లో ఏసీ నుంచి మంటలు