బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?

వెనుకబడిన వర్గాలకు ఏమీ చేయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 09 Dec 2022 07:14 IST

ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌కు ఓటమే
రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి ఇవే చివరి ఎన్నికలు
కలసి రండి.. ముందుండి నడిపిస్తా
పొన్నూరు పర్యటనలో ప్రజలకు చంద్రబాబు పిలుపు

నాలుగేళ్ల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలు గుర్తుకొచ్చారు. జయహో బీసీ పేరుతో నిర్వహించిన సభకు 1600 బస్సుల్లో బలవంతంగా తరలించారు. వారంతా ఇష్టంతో వచ్చిన జనం కాదు.. సభకు రాకపోతే సంక్షేమ పథకాలు తొలగిస్తారని బెదిరించి తీసుకొచ్చారు. ఎన్నికల లగ్నం ఎప్పుడొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని, వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయం. తొందరల్లోనే జగన్‌ పవర్‌ కట్‌ చేస్తాం

తెదేపా అధినేత చంద్రబాబు


ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- పొన్నూరు, బాపట్ల: వెనుకబడిన వర్గాలకు ఏమీ చేయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. జయహో బీసీ సభకు రాకపోతే సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరించి, 1600 బస్సుల్లో బలవంతంగా తరలించారని ధ్వజమెత్తారు. నీ బాబాయి తూర్పుగోదావరి జిల్లాకు వెళితే బీసీ మంత్రితో కాళ్లు మొక్కించుకుంటారా? బీసీలను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనందరం అనుకుంటే సీఎం పవర్‌ కట్‌ అవుతుంది.. సహాయ నిరాకరణ ప్రారంభించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేషన్‌, పింఛన్‌, అమ్మఒడి కట్‌ చేసినా మళ్లీ మేము ఇస్తామని భరోసా ఇచ్చారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు, నారాకోడూరు, చేబ్రోలుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. 

నాది పేదవాళ్ల కులం

‘నాకు కులం లేదు. పేదవాళ్లందరూ నా కులస్థులే. ఈ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత 152 కులాల వారికి న్యాయం చేసి రుణం తీర్చుకుంటాం. బీసీల సమావేశంలో భోజనం పెట్టకుంటే వారు వచ్చి అన్న క్యాంటిన్‌లో భోజనం చేశారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నలుగురికి సీఎం రాష్ట్రాన్ని రాసిచ్చేశారు. పొన్నూరు ప్రాంతంలో మూడేళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అమరరాజా కంపెనీని తెలంగాణలో పెట్టారు.. పరిశ్రమలు తరలిపోతున్నా సీఎంకు బుద్ధి లేదా? నాపైన, జయదేవ్‌పైన కేసులు పెడుతున్నారు’ అని చెప్పారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఏ2 విజయసాయిరెడ్డి పేరు ఉందని, ఆయన ఫోన్‌ పోలీసులు వెతికిపెట్టాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

జగన్‌ పవర్‌ కట్‌ చేస్తాం

‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని, వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయం. తొందరలోనే జగన్‌ పవర్‌ కట్‌ చేస్తాం. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇవే చివరి ఎన్నికలు. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోలేం. ప్రజలంతా కలసి రావాలి. నేను ముందుండి పోరాడతా. సీఎం సభలకు బలవంతంగా తీసుకొచ్చినా జనం వెళ్లిపోతున్నారు. తెదేపా సమావేశాలకు స్వచ్ఛందంగా వచ్చి అర్ధరాత్రి దాటినా ఉంటున్నారు. సైకో పాలన వద్దు.. సైకిల్‌ పాలన కావాలనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి. తెదేపా ఆవిర్భావం నుంచి పొన్నూరు నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. నరేంద్రను నేరుగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీసి కేసులు పెట్టి జైలుకు పంపారు’ అని అన్నారు. రైతులు పెట్టిన సంగం డెయిరీని కాదని, గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీని తీసుకొచ్చి జగన్‌ రాష్ట్ర ఆస్తులు కట్టబెట్టారని విమర్శించారు.

పుట్టబోయే బిడ్డకు కూడా అప్పులు

‘రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది.. తలసరి ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగాయి. పన్నులు పెరిగాయి. రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రభుత్వ అప్పు చేసే పరిస్థితి వచ్చింది. ఆర్బీకేలు ఎక్కడైనా సాయం చేశాయా? ప్రభుత్వం పంట కొనకపోవడంతో రైతులు బయట అమ్ముకుని నష్టపోతున్నారు. రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనంతటికీ కారణం జగన్‌. మూడు రాజధానులున్న రాష్ట్రం ఉందా? కర్నూలు, ఇచ్ఛాపురం మధ్యలో గుంటూరు జిల్లా ఉందని కళ్లు లేని వారు కూడా చెబుతారు. దీనికి కులమతాలు పేరు చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కర్నూలు వెళ్లి మూడు రాజధానులు కావాలని అడిగితే ముక్తకంఠంతో ఒకే రాజధాని, అమరావతి కావాలన్నారు. రాష్ట్రం మొత్తం ఒకే రాజధాని కావాలంటున్నారు. చేతకాని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజధానిని నాశనం చేశారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 8వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు వచ్చాయా అని ప్రశ్నించారు. 

సంక్షేమం కాదు సంక్షోభం

‘ప్రజలకు పది రూపాయలు పడేసి వారి జేబులో నుంచి రూ.10 వేలు కొట్టేస్తున్నారు. ఇది సంక్షేమం కాదు సంక్షోభం. ముఖ్యమంత్రి మద్యం, ఇసుక, మైనింగ్‌, సెజ్‌ల మీద అడ్డగోలుగా దోచుకుంటున్నారు’ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మట్టి, మద్యం, బ్లీచింగ్‌ పౌడర్‌నూ వదిలిపెట్టలేదని, రేషన్‌ బియ్యం మాఫియాతోనూ చేతులు కలిపారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన కిలాడీ పనులు చేస్తూ కిలాడీ రోశయ్యగా మారారని ధ్వజమెత్తారు. 

అడుగడుగునా ఆత్మీయ స్వాగతం

ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు పెదకాకాని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బుడంపాడు కూడలి వద్ద భారీ గజమాలలతో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఆయన్ను స్వాగతించారు. అక్కడి నుంచి ద్విచక్రవాహన ర్యాలీతో నాయకులు, కార్యకర్తలు రాగా చంద్రబాబు ముందుకు సాగారు. ఆయనకు దారి పొడవునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. నేతలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కోవెలమూడి రవీంద్ర, నసీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

వైకాపా, తెదేపా నినాదాలతో పొన్నూరులో ఉద్రిక్తత

పొన్నూరులోని వైకాపా కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. రోడ్‌షో జరిగే జీబీసీ రోడ్డుపైకి రావటానికి ప్రయత్నించారు. దీనికి ప్రతిగా తెదేపా నేతలు, కార్యకర్తలు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ అంటూ పోస్టర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకురావటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

బాబు పర్యటనలో భద్రతా లోపాలు

చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనకు ఆటంకాలు సృష్టించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించాయి. పర్యటనకు ముందు నుంచి వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడినా కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. కనీసం ట్రాఫిక్‌నూ నియంత్రించలేదు.  తన పర్యటనకు బందోబస్తులో పోలీసులను కేటాయించరా? వైకాపా సైకో నేతలు తెదేపా సభను అడ్డుకుంటారా? అని చంద్రబాబు నిలదీశారు. అయిదుగుర్ని ఆపలేని పోలీసులకు భారతరత్న ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మీకు 50 వేల మంది పోలీసులు ఉంటే.. నాకు 5 కోట్ల మంది తెలుగు సైన్యం ఉందని స్పష్టం చేశారు.


చంద్రబాబు సభకు వెళితే డ్వాక్రా రుణాలు ఇవ్వం!

వెళ్లేవారి ఫొటోలు తీయాలని అధికారుల ఆదేశం

బాపట్లలో చంద్రబాబు శుక్రవారం నిర్వహించే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ బహిరంగ సభకు వెళ్లరాదని పొదుపు సంఘాల మహిళలపై డీఆర్‌డీఏ అధికారులు ఆంక్షలు విధించారు. ఏపీఎంలు, ఆర్‌పీలు, యానిమేటర్ల ద్వారా గ్రామాల్లో పొదుపు సంఘాల ప్రతినిధులకు వాట్సప్‌ కాల్‌ ద్వారా గురువారం హెచ్చరికలు జారీ చేశారు. ఆదేశాలు ధిక్కరించి సభకు వెళ్లే వారి ఫొటోలు తీయాలని, అలాంటి వారిని గుర్తించి ఇకపై ఎలాంటి రుణాలు మంజూరు చేయవద్దంటూ కర్లపాలెం మండలంలోని మూడు గ్రామాల్లో మహిళా సంఘాలకు బెదిరింపులు వచ్చాయి. మా మాట వినకుండా ప్రతిపక్ష నేత సభకు హాజరైతే తీవ్రంగా ఇబ్బంది పడతారు జాగ్రత్త అని ఓ అధికారి హెచ్చరించినట్లు తెలిసింది. పట్టణంలోని పొదుపు సంఘాల మహిళలను సభకు వెళ్లవద్దంటూ మెప్మా సిబ్బందితో చెప్పించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు