సంక్షిప్త వార్తలు(3)

బీసీలకు కులాలవారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.

Updated : 09 Dec 2022 06:40 IST

ఉత్సవ విగ్రహాలుగా బీసీ కార్పొరేషన్లు: సీపీఎం

ఈనాడు, అమరావతి: బీసీలకు కులాలవారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. నవరత్నాల్లో ప్రకటించిన కొన్ని పథకాల్లో వివిధ కారణాలతో సగం మందికి ప్రయోజనాలు అందడం లేదని, అర్హులైన వారందరికీ పథకాలు అందించేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక అవకాశం కల్పించాలని కోరారు. ‘‘జయహో బీసీ సభ కోసం అధికార దుర్వినియోగం జరిగింది. ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు చిన్నపాటి నిరసన కార్యక్రమానికి, సభలు, ప్రదర్శనలకు విపరీత ఆంక్షలు విధించే పోలీసు యంత్రాంగం బీసీ సభ రోజున ప్రేక్షక పాత్ర వహించడం గర్హనీయం’’ అని పేర్కొన్నారు.


కేంద్రంపై పోరాటం చేయలేకే వైకాపా కుంటిసాకులు: సీపీఐ

ఈనాడు, అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై పోరాడలేక వైకాపా కుంటిసాకులు వెదుకుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ‘‘ఏ అవకాశం ఉన్నా ఏపీ ఉమ్మడిగానే ఉండాలని కోరతామంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన తీరు పెళ్లయిన ఆరు నెలలకు బాజాలు మోగించినట్లు ఉంది. వైకాపాకు 30 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై పోరాడక పోగా.. మోదీ అడుగులకు ఎందుకు మడుగులొత్తుతున్నారు? సీఎం జగన్‌కు రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా కుంటిసాకులు మాని కేంద్రంతో పోరటానికి సిద్ధం కావాలి’’ అని సూచించారు.


ఉన్మాదులు రెచ్చిపోతున్నారు: వంగలపూడి అనిత

ఈనాడు డిజిటల్‌, అమరావతి : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను సీఎం జగన్‌రెడ్డి దుర్వినియోగం చేయడంతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రోజుకో ప్రేమోన్మాది యువతుల ప్రాణం తీస్తున్నా సీఎంకి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. మొన్న రమ్య, నిన్న తపస్విని, రేపు ఎవరో? అని గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘జగన్‌ పాలనలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన పోలీసులు, ప్రతిపక్ష నేతలను కట్టడి చేయటం, అక్రమ కేసులతో వేధించడంలో మాత్రం విజయవంతమయ్యారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న దంత వైద్య విద్యార్థిని తపస్విని జగన్‌రెడ్డి పాలనలో ఓ ఉన్మాది చేతిలో బలైంది. ముఖ్యమంత్రి అసమర్థతకు ఇంకెంతమంది బలి కావాలి? మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రంలోని మహిళలకు భద్రత, రక్షణ’ అని అనిత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని