తెదేపా ఎస్సీ సెల్‌ మహిళా నాయకురాలి అరెస్టు

సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను అరెస్టు చేశారు.

Published : 09 Dec 2022 03:31 IST

అనంతపురం(మూడోరోడ్డు), తాడిపత్రి, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కమలమ్మను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలికలో మూలనపడిన వాహనాలకు మరమ్మతులు చేయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటూ బుధవారం మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వైకాపా, తెదేపా నాయకులు సామాజిక మాధ్యమాల్లో పరస్పర వ్యాఖ్యలు చేసుకున్నారు. కమలమ్మ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ వైకాపా నాయకుడు గురుశంకర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఆమెను అరెస్టు చేసి అనంతపురంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు చెప్పారు.
కమలమ్మపై తాడిపత్రి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153ఏ, 505(2) నేరాల కింద కేసు నమోదు చేశారు.  న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి రిమాండును తిరస్కరించారు. నిందితురాలికి 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపాలని ఆదేశించారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య.. దళిత మహిళ అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారని కమలమ్మ ఆరోపించారు. డీఎస్పీ రాసలీలలు ఒక్కొక్కటిగా బయట పెడతానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని