Gujarat Election Results: పశ్చిమ తీరాన కాషాయ సునామీ

భాజపాకు లభించిన ఈ మద్దతు వారసత్వ పాలన, అవినీతిపై పెరుగుతున్న ప్రజల ఆగ్రహానికి ప్రతీక. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు.

Updated : 14 Dec 2022 11:12 IST

గుజరాత్‌లో భాజపా అఖండ విజయం

వరుసగా ఏడోసారి అధికారం కైవసం

156 సీట్లు గెల్చుకున్న కమలదళం

తేలిపోయిన కాంగ్రెస్‌, ఆప్‌

అహ్మదాబాద్‌, శిమ్లా

భాజపాకు లభించిన ఈ మద్దతు వారసత్వ పాలన, అవినీతిపై పెరుగుతున్న ప్రజల ఆగ్రహానికి ప్రతీక. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు.  గుజరాత్‌ జనశక్తికి తల వంచి నమస్కరిస్తున్నా. భాజపాకు ఓటు వేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు కృతజ్ఞతలు. దిల్లీ నగరపాలిక ఎన్నికలో ప్రజలను మభ్యపెట్టారు. ఆ పార్టీ (ఆప్‌)ని చూస్తే.. ‘ఆమదనీ అఠన్నీ ఖర్చా రూపయియా’ (ఆదాయం అర్ధణా ఖర్చు రూపాయి) సామెత గుర్తొస్తోంది.      

ఫలితాలపై మోదీ స్పందన

గుజరాత్‌లో తమకు ఎదురులేదని భాజపా మరోసారి నిరూపించుకుంది. రాష్ట్రంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న పట్టును మరింత పదిలం చేసుకుంటూ.. అసెంబ్లీలో నాలుగింట మూడొంతులకుపైగా నియోజకవర్గాలను గెల్చుకుంది. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 156 సీట్లను తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించింది. గత ఎన్నికల్లో కమలదళానికి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఈసారి తేలిపోయింది. 17 స్థానాలను మాత్రమే దక్కించుకొని భాజపాకు చాలాదూరంలో రెండో స్థానంలో నిలిచిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా రంగప్రవేశం చేసి, దూకుడైన ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ఘోరంగా చతికిలపడింది. కేవలం ఐదంటే ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది. గుజరాత్‌లో ప్రధాని మోదీ ప్రభ ముందు- విపక్షాలు లేవనెత్తిన అంశాలన్నీ చిన్నబోయాయి. భాజపాకు ప్రజాదరణను తగ్గించడంలో విఫలమయ్యాయి. ఆ పార్టీ 52.5% ఓట్లు సాధించి సత్తాచాటింది.


కాంగ్రెస్‌కు ఆప్‌ దెబ్బ

తమ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో తీరికలేకుండా ఉండటంతో గుజరాత్‌లో ఈ దఫా ఎక్కువగా స్థానిక  కాంగ్రెస్‌ నేతలే ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ నిశ్శబ్ద ప్రచారం నిర్వహించారు. ఆ వ్యూహం ఎంతమాత్రమూ కలిసిరాలేదు. దీనికితోడు ఆప్‌ రాకతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొని.. కాంగ్రెస్‌ బాగా నష్టపోయింది. తాజా ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం 27.3% ఓట్లు దక్కించుకుంది. ఆప్‌ దాదాపు 12.9% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది.


కేజ్రీవాల్‌ ఆశలు గల్లంతు!

గుజరాత్‌లో అరంగేట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే రెండంకెల శాతం ఓట్లను సాధించడం, ఐదు స్థానాల్లో విజయం సాధించడం ఆప్‌నకు ఒకింత ఊరటనిచ్చే విషయమే! అయితే ఆప్‌ ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే.. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ 2024 ఎన్నికల్లో ప్రధాని పదవి రేసులో మోదీకి గట్టి ప్రత్యర్థిగా అవతరించి ఉండేవారన్నది విశ్లేషకుల మాట. తాజా ఫలితాలతో కేజ్రీవాల్‌ ఆశలకు ప్రస్తుతానికి కళ్లెం పడినట్లయిందని వారు చెబుతున్నారు.


సీఎంగా కొనసాగనున్న భూపేంద్ర పటేల్‌

గుజరాత్‌ సీఎం పీఠంపై భూపేంద్ర పటేల్‌ కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఘన విజయం అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. భూపేంద్ర ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఆయన అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన దళిత నేత, కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ వద్గాం అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన తొలి రౌండ్లలో వెనుకబడినా తర్వాత పుంజుకున్నారు.

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు