నాడు స్వరాష్ట్ర కాంక్ష.. నేడు స్వదేశీ స్వావలంబన

కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును ధ్రువీకరించడంపై మంత్రి హరీశ్‌రావు  గురువారం ట్విటర్‌లో సంతోషం వ్యక్తం చేశారు.

Published : 09 Dec 2022 05:14 IST

మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును ధ్రువీకరించడంపై మంత్రి హరీశ్‌రావు  గురువారం ట్విటర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు, పార్టీశ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి స్ఫూర్తితో మున్ముందు దేశంలో మార్పు కోరుకుందామని, స్వావలంబన సాధించేలా అడుగేద్దామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్‌ ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ ఆదర్శమని కేంద్రప్రభుత్వం, మంత్రులు, నీతిఆయోగ్‌ తెలంగాణను ఎన్నోసార్లు అభినందించటం తెలిసిందే. రాష్ట్రం అనేక రంగాల్లో అద్భుత విజయం సాధించినట్లుగానే దేశాన్నీ అదే మార్గంలో తీసుకెళ్లాలి.. అంటూ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన మహాయజ్ఞమిది. దేశ రాజకీయాల్లో ఆ దిశగా మనం అడుగేద్దాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

భారాసతో కొత్త చరిత్ర: వినోద్‌కుమార్‌  

భారత్‌ రాష్ట్ర సమితి(భారాస) జాతీయ పార్టీతో కొత్త చరిత్ర సృష్టిస్తామని, కేసీఆర్‌ ద్వారా దేశ రాజకీయాల్లో సమీకరణాలన్నీ మారిపోతాయని, తెలంగాణ అభివృద్ధి నమూనా అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేస్తామని తెరాస సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. తెరాస పేరును భారాసగా మార్చేందుకు ఈసీ అనుమతించిన నేపథ్యంలో వినోద్‌ తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జాతీయ పార్టీగా భారాసను ప్రకటించాక దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది.  భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా తీర్చిదిద్దడమే భారాస ప్రధాన లక్ష్యం’’ అని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు