7.. విజయాల రేడు!
రాష్ట్రంలో ఐదేళ్లపాటు పాలన సాగించి మరోసారి అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టం. రెండోసారి విజయం సాధించాలంటే చెమటోడ్చాల్సి ఉంటుంది.
3 రాష్ట్రాల్లో ఏడుసార్లు గెలుపొందిన పార్టీలు
మరికొన్నింట్లో మూడు కంటే ఎక్కువ సార్లు అధికారం
రాష్ట్రంలో ఐదేళ్లపాటు పాలన సాగించి మరోసారి అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టం. రెండోసారి విజయం సాధించాలంటే చెమటోడ్చాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకెళ్తున్నాయి. తాజాగా భాజపా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి గెలుపొంది కాషాయ జెండాను రెపరెపలాడించింది. దేశంలో ఇదివరకు మహారాష్ట్రలో కాంగ్రెస్, పశ్చిమబెంగాల్లో సీపీఎం ఏడు సార్లు వరుసగా అధికారాన్ని చెలాయించిన పార్టీలుగా గుర్తింపు పొందాయి. తాజాగా భాజపా కూడా మూడో పార్టీగా చరిత్రపుటలకు ఎక్కింది. అలాగే, ఇదివరకు త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లోని పార్టీలు మూడు కంటే ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చి తమ ఉనికి చాటాయి. ఇప్పుడు గుజరాత్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతుండగా.. మరికొన్ని మాత్రం ఓటు బ్యాంకును కాపాడుకుంటూ, ప్రజావ్యతిరేకతను దాటుకుంటూ విజయాలకు బాటలు పరచుకుంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని సుస్థిర పరచుకుంటున్నాయి.
మోదీ వ్యూహం.. గుజరాత్లో సుస్థిరం
గుజరాత్లో ఇప్పటికే 27 ఏళ్లు అధికారంలో ఉన్న భాజపా మరో ఐదేళ్ల పాలనకు మార్గం సుగమం చేసుకుంది. భాజపా ఆ రాష్ట్రంలో 1995లో 182 స్థానాలకు 121 సీట్లు దక్కించుకుని తొలిసారి అధికారం చేపట్టింది. అప్పుడు మొదలైన కాషాయ పార్టీ విజయపరంపర (1998లో 117 సీట్లు, 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99, తాజా ఎన్నికల్లో 156 సీట్లతో) ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తొలినాళ్లలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆ పార్టీ మొదటి రెండేళ్లలోనే రెండు సార్లు సీఎంలను మార్చింది. అనంతరం అక్కడ 27 రోజులు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత వచ్చిన రాష్ట్రీయ జనతా పార్టీ రెండేళ్లు పాలించినా.. స్థిరంగా నిలవలేకపోయింది. 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చిన భాజపా.. నేటివరకూ వెనక్కి తిరిగి చూడలేదు. 2001లో సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. తనదైన వ్యూహంతో గుజరాత్లో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘనత
భారత రాజకీయ చరిత్రలో వరుసగా ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తొలిఘనత కాంగ్రెస్‌కు దక్కుతుంది. మహారాష్ట్రలో ఆ పార్టీ 1962, 1967, 1972, 1978, 1980, 1985, 1990 ఎన్నికల్లో గెలుపొంది సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగింది. 1978 ఎన్నికల్లో భారతీయ కాంగ్రెస్ 69 సీట్లు, ఇందిరా కాంగ్రెస్ 62 సీట్లు గెలుచుకున్నాయి. దాంతో తొలుత అక్కడ కాంగ్రెస్ (యు), కాంగ్రెస్ (ఐ)ల సంయుక్త ఆధ్వర్యంలో వసంత దాదాపాటిల్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శరద్‌పవార్ కాంగ్రెస్(యు)ని చీల్చి కాంగ్రెస్ (ఎస్) పేరుతో పార్టీ జనతాపార్టీ మద్దతుతో 38 ఏళ్లకే సీఎం అయ్యారు. ఆ ప్రభుత్వం ఏడాదిన్నరకు మించి సాగలేదు. దీంతో అక్కడ రెండేళ్లకే ఎన్నికలు జరిగాయి. 1986లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన రెండుసార్లు సీఎం అయ్యారు.
’పశ్చిమా’న అరుణతార..
పశ్చిమబెంగాల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి 1977, 1982, 1987, 1991, 1996 2001, 2006 ఎన్నికల్లో గెలుపొందింది. బెంగాల్‌ను 34 ఏళ్లపాటు పాలించి కమ్యూనిస్టులు రికార్డు నెలకొల్పారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి అప్రతిహతంగా ప్రభుత్వాన్ని నడిపింది. జ్యోతిబసు 2000లో బాధ్యతల నుంచి వైదొలిగాక బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టారు. ఆయన మరో పదేళ్లు అధికారాన్ని నిలబెట్టారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటకు గండికొడుతూ 2011లో సీఎంగా విజయం సాధించారు. 2016, 2021 ఎన్నికల్లోనూ గెలుపొంది బెంగాల్ బొబ్బిలిగా అవతరించారు.
సిక్కింలో పీకే చామ్లింగ్
స్వతంత్ర భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఓ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కూడా నిలిచింది. 1994లో సీఎంగా అధికారం చేపట్టిన పవన్ కుమార్ చామ్లింగ్.. వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. దేశంలో అత్యధిక కాలం ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగానూ చామ్లింగ్ నిలిచారు. 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ పార్టీ విజయం సాధించడంతో పవన్ కుమార్ చామ్లింగ్ సీఎం పీఠానికి దూరమయ్యారు.
త్రిపుర మాణిక్యం..
త్రిపుర రెండు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది. 1978 నుంచి 1988 వరకు సీపీఎం తరఫున నృపేన్ చక్రవర్తి త్రిపుర సీఎంగా కొనసాగారు. తర్వాత ఓ దఫా కాంగ్రెస్‌కు చేతికి అధికారం దక్కింది. 1993లో మళ్లీ అధికారం చేపట్టిన సీపీఎం.. 23 ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఇందులో 1998 నుంచి 2018 వరకు జరిగిన 4 ఎన్నికల్లో మాణిక్ సర్కార్ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో త్రిపుర సీఎం పీఠాన్ని భాజపా చేజిక్కించుకొని 2022లో రెండోసారి విజయం సాధించింది.
ఒడిశా బాద్షా.. నవీన్
ఒకే పార్టీ వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం ఒడిశా కూడా ఉంది. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పొందిన బిజూ జనతా దళ్(బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. ఇప్పటివరకు ఐదుసార్లు వరుసగా విజయం సాధించారు. 2000లో 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఇప్పటికీ విజయవంతమైన పాలన సాగిస్తున్నారు.
ఈనాడు దిల్లీ, ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం