మృదుభాషి భూపేంద్రునికే మళ్లీ పట్టాభిషేకం

భాజపాలో మృదుభాషిగా పేరున్న భూపేంద్ర రజనీకాంత్‌భాయ్‌ పటేల్‌ చేతికే మరోసారి గుజరాత్‌ పగ్గాలు దక్కుతున్నాయి.

Published : 09 Dec 2022 05:32 IST

అహ్మదాబాద్‌: భాజపాలో మృదుభాషిగా పేరున్న భూపేంద్ర రజనీకాంత్‌భాయ్‌ పటేల్‌ చేతికే మరోసారి గుజరాత్‌ పగ్గాలు దక్కుతున్నాయి. ఆయన ఈ నెల 12న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ తెలిపారు. చాలామంది ‘దాదా’ అని పిలుచుకునే భూపేంద్ర.. మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌కు సన్నిహితుడు. 1962 జులై 15న అహ్మదాబాద్‌లో పుట్టిన ఆయన 1982లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి, అనంతరం బిల్డర్‌ అయ్యి రాజకీయాల్లోకి ప్రవేశించారు. పాటీదార్లలో కడ్వా వర్గానికి చెందిన నేత.

నిర్వహించిన పదవులు

1995లో తొలిసారి మేమ్‌నగర్‌ స్థానం నుంచి అహ్మదాబాద్‌ నగరపాలిక సభ్యుడిగా ఎన్నిక. అనంతరం 1999, 2004లోనూ విజయం

2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌

2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో స్థాయీసంఘం ఛైర్మన్‌

2015 నుంచి 2017 వరకు అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏయూడీఏ) ఛైర్మన్‌

2017లో ఘట్లోడియా స్థానంలో పోటీ చేసి 1.7 లక్షల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా విజయం

2021 సెప్టెంబరు 13న గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

2022 డిసెంబరు 8న ఘట్లోడియా స్థానం నుంచే 1.92 లక్షల ఓట్ల తేడాతో విజయం

ఘట్లోడియా నియోజకవర్గం..

అహ్మదాబాద్‌ జిల్లాలో 2012లో తొలిసారిగా ఘట్లోడియా నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ పాటీదార్ల జనాభా ఎక్కువ. 2012లో మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ ఇక్కడినుంచే పోటీచేసి గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గంగా ఘట్లోడియా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు