సీఎంల మార్పుతో భాజపాలో వేర్వేరు ఫలితాలు

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రుల్ని మార్చడం, ప్రభుత్వంపై అప్పటివరకు ఏమైనా వ్యతిరేకత ఉంటే దానిని ఆ రూపంలో తొలగించుకునే ప్రయత్నం చేయడం.. ఈ పాచిక గుజరాత్‌లో సఫలమైతే, హిమాచల్‌లో ఫలించలేదు.

Published : 09 Dec 2022 05:32 IST

దిల్లీ: ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రుల్ని మార్చడం, ప్రభుత్వంపై అప్పటివరకు ఏమైనా వ్యతిరేకత ఉంటే దానిని ఆ రూపంలో తొలగించుకునే ప్రయత్నం చేయడం.. ఈ పాచిక గుజరాత్‌లో సఫలమైతే, హిమాచల్‌లో ఫలించలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా చవిచూసిన ఫలితాలు దీనిని చాటుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ ముఖ్యమంత్రుల్ని మార్చి కమలనాథులు సానుకూల ఫలితాలు పొందారు. గత ఏడాది సెప్టెంబరులో భూపేంద్ర పటేల్‌ను గుజరాత్‌కు సీఎంగా భాజపా ఎంపికచేసింది. విజయ్‌ రూపాణీ పూర్తిగా ఒక ఏడాది కూడా సీఎంగా కొనసాగకుండానే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆయనతోపాటు మొత్తం మంత్రిమండలిని భాజపా మార్చేసింది. సీఎంలను మారుస్తుండడంపై రాజకీయంగా విమర్శలు వచ్చినా, క్షేత్రస్థాయి సమాచారం మేరకే అలా చేశామని పార్టీ నాయకత్వం సమర్థించుకుంటూ వచ్చింది. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండుసార్లు ముఖ్యమంత్రుల్ని భాజపా మార్చింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచినా, సీఎం అభ్యర్థి పుష్కర్‌సింగ్‌ ధామి ఓడిపోయిన విషయం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఏడాది ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి చవిచూసినా సీఎం జైరాం ఠాకుర్‌ను మార్చకపోవడాన్ని పార్టీ నాయకుడొకరు ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని