సేవ ముసుగులో స్వామి కార్యం

రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలులో లోపాలపై పౌరులు ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే... చుట్టూ ఒకసారి పరికించి చూసి, వాలంటీరు లేరని నిర్ధారించుకున్నాకే పెదవి విప్పుతున్నారు.

Published : 10 Dec 2022 06:22 IST

రాష్ట్రంలో వాలంటీర్ల ఇష్టారాజ్యం  
అధికార పార్టీకి కళ్లూచెవులూ వాళ్లే
పెదవి విప్పడానికీ భయపడుతున్న జనం

రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలులో లోపాలపై పౌరులు ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే... చుట్టూ ఒకసారి పరికించి చూసి, వాలంటీరు లేరని నిర్ధారించుకున్నాకే పెదవి విప్పుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజల్ని అంతగా భయపెడుతోంది. కొందరు వాలంటీర్లు... మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల బాగా పెరిగాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఈ వ్యవస్థ ఒక మాఫియాలా మారిందని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, వారిని నియంత్రించకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకోలేరని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు చేస్తున్న అరాచకాల గురించి చెబుతూ పోతే... పెద్ద గ్రంథమే అవుతుంది.


ఈ వ్యవస్థపై హైకోర్టు ఏమందంటే..

వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల్ని వాలంటీర్లే నిర్ణయించడంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 6న హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా మండిపడింది. వాలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టుకి వివరాలు సమర్పించేందుకు శ్రీకాకుళం నుంచి వస్తున్న ఒక కుటుంబానికి చెందినవారిని స్థానిక వాలంటీర్‌ నిర్బంధించడాన్ని హైకోర్టు ప్రస్తావించింది.


వీరి గురించి సీఎం ఏం చెప్పారంటే...!

వివక్షకు, లంచానికి తావులేకుండా, కుల, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఒక వ్యవస్థ తీసుకురావాలన్న స్వప్నం నుంచి వచ్చిందే గ్రామ/వార్డు వాలంటీర్‌ వ్యవస్థ. దేశం మొత్తం మనవైపు చూసేలా ఈ వ్యవస్థ మూడేళ్లుగా గొప్పగా నడుస్తోంది. తమకు వచ్చేది ఎంతని లెక్కలు వేసుకోకుండా... చేసే సేవ ఎంతని లెక్కలేస్తూ, వారు పేదల కళ్లలో సంతోషం, సంతృప్తినే చూస్తున్నారు. గుండెల నిండా మానవతావాదం నిండిన మహా సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నా.

2022 ఏప్రిల్‌ 7న నరసరావుపేటలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం జగన్‌ వ్యాఖ్యలివి. బయటి వాళ్లెవరైనా ఆయన మాటలు వింటే... వైకాపా ప్రభుత్వం 2.61 లక్షల మంది మానవతామూర్తుల్ని తయారు చేసిందేమోనని భ్రమపడతారు.


వైకాపా నాయకుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే...

వాలంటీర్ల పెత్తనం ఎక్కువైపోయిందని, మా దగ్గరకు ఎవరూ రావడం లేదని మీలో కొందరంటున్నారు. వాలంటీర్లు ఎవరు? వారిని ఎవరు పెట్టారు? సీఎం జగన్‌ ఆదేశం మేరకు వాలంటీర్లను పెట్టింది ఎమ్మెల్యేలమైన మనమే కదా? వారు ఎలా వచ్చారు... మీరు చెబితేనే... మీరు పలానా వాళ్లను పెట్టమంటే వాళ్లనే పెట్టాం... అవసరమైతే తీసేస్తాం... ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లను తీసేసి... కొత్తవారిని వేసేస్తాం... వాలంటీర్లు వైకాపా కోసం పనిచేస్తున్న కార్యకర్తలు... ప్రతి విషయాన్ని 50 ఇళ్లకో, 100 ఇళ్లకో చేరవేసే సైనికులు. గ్రామాల్లోని మీ నాయకత్వం వారిని గ్రిప్‌లో పెట్టుకుని ముందుకు వెళ్లాలి’.

ఇప్పుడర్థమైంది కదా వాలంటీర్లు ఎవరో, ఎవరి కోసం పనిచేస్తున్నారో!


వాలంటీర్ల దురాగతాల్లో మచ్చుకు కొన్ని

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల వైకాపా నేతలు సమకూర్చిన వాహనాల్లో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభా స్థానం ఉప ఎన్నికలోనూ వైకాపా కార్యకర్తల్లా పనిచేశారు.

* కొన్నిచోట్ల వైకాపా నేతల ఆదేశాల మేరకు కులాల వారీగా లబ్ధిదారుల జాబితాను వాలంటీర్లు సేకరించారు. ఏ సామాజికవర్గానికి ఏఏ పథకాలు అందాయి. ఎక్కువగా లబ్ధి పొందిన వర్గాలేవి? వంటి వివరాల్ని నమోదు చేశారు.

* చాలామంది ఎమ్మెల్యేలు... వాలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను నడుపుతున్నారు. వారితో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గ్రామాల వారీగా పార్టీల బలాబలాల వివరాలను సేకరిస్తున్నారు.

* ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీకి సంబంధించిన మండల స్థాయి అధికారులు(ఎమ్‌ఎల్‌వో) క్రమం తప్పకుండా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ... ప్రజలు ఎవరైనా వైకాపాపై అసంతృప్తితో ఉన్నారా? కారణాలేంటి? వారు ఏ పార్టీకి చెందినవారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడి, వ్యతిరేకతను పోగొట్టాలని పైనుంచి ఆదేశిస్తున్నారు.

* కొన్ని నెలల క్రితం సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ సర్వే పేరుతో... వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల పాన్‌కార్డుల వివరాలను సేకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

* తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఫిబ్రవరి 2న జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందారు. వాలంటీర్‌ రాంబాబు అందులో క్రిమిసంహారక మందు కలపడంతోనే వారు చనిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

* శ్రీకాకుళం జిల్లా మందస మండలం మేఘమాల గ్రామానికి చెందిన వాలంటీర్‌ రాజారావు     నాటుసారా విక్రయిస్తూ 2022 జూన్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు.


హాజరు లేకున్నా వేతనాలు

బయోమెట్రిక్‌ హాజరు నమోదైతేనే వాలంటీర్లకు వేతనాలివ్వాలనే ఉత్తర్వులున్నా... కొందరి విషయంలో అమలవడం లేదు. వైకాపాలో చురుగ్గా పనిచేస్తున్న వాలంటీర్లు కొందరు విధులకు సరిగా హాజరవడమే లేదు. ఎక్కడైనా అధికారులు వారికి వేతనాలు నిలిపివేస్తే.. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు.


నేరాలు... ఘోరాలు!

అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని కొన్నిచోట్ల వాలంటీర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి ఘోరమైన నేరాలకు తెగబడుతున్నారు.

* చిత్తూరు నగరపాలక సంస్థ నాల్గో డివిజన్‌లోని కట్టమంచిలో ఇళ్ల పట్టాలిప్పిస్తానని పేదల నుంచి ఒక వాలంటీర్‌ డబ్బులు వసూలు చేశారు.

* శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని ఓ వాలంటీర్‌ హరిప్రసాద్‌ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

* విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం సునపర్తికి చెందిన ఎం.సన్యాసినాయుడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే వాలంటీర్‌ నరసింగరావు రూ.50 వేలు డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇవ్వనందుకు.. .అదే స్థలాన్ని 1972లో వేరొకరికి సన్యాసినాయుడు విక్రయించినట్లు తప్పుడు దస్తావేజులు సృష్టించాడు. దాంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు.

* నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటికంభంపాడులో ఉపాధి హామీ పనులపై నిర్వహించిన గ్రామసభలో అక్రమాలపై ప్రశ్నించిన సర్పంచి లావణ్యపై... స్థానిక వాలంటీర్‌ అనూష దాడికి ప్రయత్నించింది.

* రేషన్‌ సరకుల పంపిణీ సమాచారం తెలియజేయలేదన్నందుకు... నెల్లూరు జిల్లా కోవూరులోని రాళ్లమిట్టలో వాలంటీర్‌ దివ్య ఒక వృద్ధురాలి తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది.

* మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మచిలీపట్నంలోని వాలంటీర్‌ ఎం.కృష్ణను వారించేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు.

* తన ప్రేమకు అడ్డుతగులుతున్నాడని విజయనగరానికి చెందిన వాలంటీర్‌ బ్రాహ్మాజీ అక్టోబరులో తన స్నేహితుడిని హత్య చేశాడు.

* ఇంట్లో నాటు తుపాకులు తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చింతోపులో వాలంటీర్‌ రవిని పోలీసులు పట్టుకున్నారు.


సమావేశాలకు జనాన్ని తరలించేదీ వారే...!

ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే ప్రభుత్వ సమావేశాలు, వైకాపా సభలకు ప్రజల్ని తరలించే బాధ్యత వాలంటీర్లదే. హాజరవకపోతే పథకాలు రద్దవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారు. వాళ్లే దగ్గరుండి వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళుతున్నారు. అక్కడ హాజరును నమోదు చేస్తున్నారు.

* నేతన్ననేస్తం, పింఛన్ల పంపిణీలో అర్హత ఉన్నవారికి కూడా... కొన్నిచోట్ల వైకాపా నేతల ఒత్తిడితో లబ్ధి చేకూరడం లేదు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా మద్దతిచ్చిన అభ్యర్థికి ఓట్లేయలేదని మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామంలో కొందరు లబ్ధిదారులకు కాపు, ఈబీసీ నేస్తం పథకాలు నిలిపేశారు.

ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని