ప్రతి మండలానికీ అన్నక్యాంటీను

రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వారంగాన్ని జగన్‌ చేజేతులా నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వారంగానికి యూనిట్ రూ.1.50కే విద్యుత్తు ఇచ్చి పూర్వవైభవం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

Published : 10 Dec 2022 06:21 IST

అధికారంలోకి వస్తే ఆక్వాకు రూపాయిన్నరకే విద్యుత్తు
సైకోయిజంతో రాష్ట్రం సర్వనాశనం
జగన్‌ను దించి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
బాపట్లలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వారంగాన్ని జగన్‌ చేజేతులా నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆక్వారంగానికి యూనిట్ రూ.1.50కే విద్యుత్తు ఇచ్చి పూర్వవైభవం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. బాపట్ల తీర ప్రాంతంలో వాణిజ్య నౌకాశ్రయం నిర్మించి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా బాపట్లలో రోడ్‌షో, బహిరంగ సభలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఇదేం ఖర్మ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. సైకో సీఎం విధానాల వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలంటే జగన్‌ను దించాలని పిలుపునిచ్చారు.

సైకోలా.. రెండు కళ్లూ పొడిచేశారు

రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లుగా తాను భావించి ప్రారంభిస్తే సైకో జగన్‌ వచ్చాక రెండు కళ్లూ పొడిచేశారని దుయ్యబట్టారు. పోలవరం పనులు 72% పూర్తిచేయడంతో పాటు పట్టిసీమను రికార్డు వేగంతో పూర్తిచేసి కృష్ణాడెల్టాకు నీరు ఇచ్చి ఆదుకున్నామన్నారు. సైకో ముఖ్యమంత్రి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, ఒక వ్యక్తి వల్ల రాష్ట్రం ఎలా నాశనం అవుతుందనేందుకు ఇవే నిదర్శనమని అభివర్ణించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ట్రాక్టర్‌ ఇసుకకు రూ.6వేలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇసుక, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణాలు ఆగిపోయి లక్షల మంది ఉపాధి కోల్పోయారని వాపోయారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు జగన్‌ను చూసి స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రజలను దోచుకుంటున్నారన్నారు.

డ్రగ్స్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం విడుదల చేసిన నివేదికలో మత్తు పదార్థాల రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడైందన్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను కాపాడుకోవాలని, దీనిపై మాట్లాడితే తెదేపా కార్యాలయంపై దాడి చేశారని, ఇప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదని అన్నారు.

అన్నక్యాంటీన్లను మించిన సంక్షేమమా?

మాట్లాడితే ముఖ్యమంత్రి సంక్షేమం అంటున్నారని, అన్నక్యాంటీన్లకు మించిన సంక్షేమం ఉందా అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు మూసేశారని నిలదీశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రతి మండలంలో అన్నక్యాంటీన్‌ ఏర్పాటుచేసి పేదల ఆకలి తీరుస్తామన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలంటే చైతన్యంతో తిరుగుబాటు చేయాలని, ఇందుకు ఇంటికొకరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

గురువులకు ఇబ్బందులు

రాష్ట్రంలో నాడు-నేడు పథకంలో రంగులు వేయడం మినహా సాధించిందేమీ లేదన్నారు. ఒక్క ఉపాధ్యాయుడూ సంతోషంగా లేరని, పాఠాలు చెప్పడం మాని మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సి రావడం బాధాకరమన్నారు. హిందూపురంలో గుండు చేయించుకున్న ఉపాధ్యాయుడి ముఖగుర్తింపు హాజరు నమోదుకాకపోవడంతో ప్రశ్నించినందుకు సస్పెండ్‌ చేశారని, ఇదేంటని నిలదీశారు.

వర్షంలోనూ కొనసాగిన పర్యటన

పొన్నూరు నుంచి చంద్రబాబు బయలుదేరక ముందునుంచి తుపాను ప్రభావంతో చిరుజల్లులు పడ్డాయి. వర్షంలోనే చంద్రబాబు పర్యటనను కొనసాగించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో కాకుండా కారులో ప్రయాణిస్తూ కార్యకర్తలు కనిపించినచోట కారు బయటకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాపట్లలో రోడ్‌షో సమయానికీ వర్షం పడుతూనే ఉంది. ఓపెన్‌టాప్‌ వాహనంలో ముందుకు సాగారు. బహిరంగ సభ ప్రారంభమయ్యే సమయానికి నిలిచిపోవడంతో సభ సజావుగా సాగింది.

చీరాల పర్యటన రద్దు

మాండౌస్‌ తుపాను కారణంగా శనివారం నాటి చంద్రబాబు పర్యటన రద్దయింది. షెడ్యూలు ప్రకారం బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు, ఎస్సీలతో సమావేశం కావాల్సి ఉంది. స్టూవర్టుపురంలో గిరిజన మహిళలతో భేటీ, రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. తుపాను కారణంగా ఇవన్నీ రద్దు చేసుకున్నారు.


పర్యటన సాగిందిలా..

గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన శుక్రవారం రెండోరోజూ కొనసాగింది. పొన్నూరులో మధ్యాహ్నం 3.30కు బయలుదేరారు. దారిలో చింతలపూడిలో 102 ఏళ్ల ధూళిపాళ్ల ఇందిరాదేవి చంద్రబాబును చూసేందుకు వీల్‌ఛైర్‌లో రోడ్డుమీదకు వచ్చారు. చంద్రబాబు కాన్వాయ్‌ దిగి ఆమెతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు. చింతలపూడి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్వగ్రామం కావడంతో తెదేపా కార్యకర్తలు సందడి చేశారు. ములుకుదురు మీదుగా చుండూరుపల్లి వద్ద చంద్రబాబు బాపట్ల జిల్లాలోకి ప్రవేశించారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు,  గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎంపీ శ్రీరామ్‌ మాల్యాద్రి, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈతేరు దళితవాడలో టీ దుకాణం వద్ద తేనీరు సేవించారు. తర్వాత రోడ్‌షో ద్వారా బాపట్ల పట్టణంలోకి ప్రవేశించారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద బహిరంగసభలో ప్రసంగించారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళ్లారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని