CM KCR: ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేస్తాం

‘మున్ముందు దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే. ఈసారి వచ్చేది రైతు ప్రభుత్వమే (అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌)’ అనే నినాదంతో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ముందుకు వెళ్తుంది.

Published : 10 Dec 2022 05:56 IST

‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో ముందుకు

14న దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం

కర్ణాటక నుంచే రాజకీయ ప్రస్థానం

అక్కడ పోటీ.. జేడీఎస్‌కు మద్దతు

రెండేళ్లలో దేశమంతటికీ నిరంతర విద్యుత్‌

ఏటా 25 లక్షల మందికి దళితబంధు 

ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్‌

1.20కి ఈసీ పత్రాలపై సంతకం

హాజరైన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

ఈనాడు - హైదరాబాద్‌

దేశానికి భారాస చారిత్రక అవసరం

తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్టే.. నేడు భారతదేశ గుణాత్మక అభివృద్ధి లక్ష్యంగా భారత్‌ రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరం.


40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం? ఆకలి సూచిలో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం? రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజాప్రతినిధులు గెలవాలి.’        

సీఎం కేసీఆర్‌


‘మున్ముందు దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే. ఈసారి వచ్చేది రైతు ప్రభుత్వమే (అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌)’ అనే నినాదంతో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ముందుకు వెళ్తుంది. ‘దేశంలో పరివర్తనకు, కారుచీకట్లను పారదోలడానికి వెలిగించిన చైతన్య దీపమే భారాస’ అని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తెలిపారు. నూతన ఆలోచనలతో దేశంలో వినూత్న ప్రగతి ఒరవడిని సృష్టించడానికి నడుం బిగిస్తామని, రాజకీయాల్లో ప్రజలే గెలవాలనే విధానాలకు శ్రీకారం చుడతామని ఆయన చెప్పారు. దేశమంతా సమానహక్కులతో పరిఢవిల్లాలని.. పాలనలో నియంతృత్వ ధోరణి పోయి సమాఖ్య స్ఫూర్తి కావాలని, స్వయంపాలన విధానం అమలు కావాలని, దళిత, బహుజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో భారాస ఆవిర్భావ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటల ముహూర్తానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పత్రాలపై కేసీఆర్‌ సంతకం చేశారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం భారాస కండువాను కేసీఆర్‌ ధరించారు. అందరికీ కండువాలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించి, మాట్లాడారు.

14న పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభం

ప్రజలు కేంద్రంలో భారాసకు అధికారమిస్తే.. రెండేళ్లలోనే దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటలూ విద్యుత్తును సరఫరా చేస్తాం. ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధును అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాల రూపకల్పన కోసం మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్తలు, మేధావులతో కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 14న దిల్లీలో భారాస పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందాం. అక్కడి నుంచి అదే రోజు పార్టీ జాతీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి దిల్లీ చేరుకోవాలి. పార్టీ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్ణాటకతోనే ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తాం. జేడీఎస్‌ పార్టీకి మద్దతిచ్చి ప్రచారంలో పాల్గొంటాం. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తాం. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి ఆయన సీఎం అవుతారనే విశ్వాసం ఉంది’ అని కేసీఆర్‌ తెలిపారు.

అద్భుత వనరులున్నా..

‘భారాస పార్టీ పతాకాన్ని ఎగురవేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన పార్టీ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. తెరాస పాలనలో అద్భుతమైన అభివృద్ధితో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం. అదే అంకితభావంతో ముందుకు పోదాం. భారతదేశంలో ఉన్న అద్భుతమైన జలవనరులు, సాగుభూమి, సమశీతోష్ణ వాతావరణం ప్రపంచంలో మరే దేశానికీ లేవు. కానీ, మానవ వనరులను వాడుకోలేకపోతున్నాం. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దేశంలో భావజాల వ్యాప్తి చేసి.. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది.

నూతన జాతీయ విధానాలు తెస్తాం

వ్యవసాయాధారిత భారతదేశంలో సేద్యరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతోంది. అదనపు జలవనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. తమిళనాట నీటి సమస్యపై దర్శకుడు బాలచందర్‌ ‘తన్నీర్‌ తన్నీర్‌’ అనే సినిమా తీస్తే నీటి బాధలు అనుభవించిన ప్రజలు ఆ సినిమాను సూపర్‌ హిట్‌ చేశారు. కావేరి నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దాల్సి ఉంది. దిక్కుమాలిన ట్రైబ్యునల్స్‌ పేరుతో కొనసాగుతున్న నీటి యుద్ధాలను నివారించాలి. దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నా.. పల్లెపల్లెకూ విద్యుత్తు అందించలేకపోతున్న దుస్థితిని సరిదిద్దాలి. ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయి? డాలర్‌ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతోంది? దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకుంది? ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను అనేక రకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉంది. వీటన్నిటితో పాటు విద్య, వైద్యం తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రతి రంగంలో ప్రగతికాముక జాతీయ విధానాలను భారాస రూపొందించి అమలు చేస్తుంది. భారాస అనే వెలుగుదివ్వెను దేశం నలుమూలలకు వ్యాపింపచేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్ఠను ద్విగుణీకృతం చేద్దాం’ అని కేసీఆర్‌ తెలిపారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని తెలిపారు. భారాస ఘనవిజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.


భారాసలోకి తొలి చేరిక

లంపూర్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చల్లా వెంకట్రామిరెడ్డి భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజునే సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఆయనకు కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి భారాసలోకి ఆహ్వానించారు. మంత్రి హరీశ్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి చల్లా రాంభూపాల్‌రెడ్డి కుమారుడు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు (కుమార్తె కొడుకు). 2004లో అలంపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెంకట్రామిరెడ్డి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009 తర్వాత ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. నియోజకవర్గంలో పట్టున్న వెంకట్రామిరెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాస చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు  

పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా.. మధ్యాహ్నం 12.30కి కేసీఆర్‌ తెలంగాణభవన్‌కు చేరుకొని తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో గుమ్మడికాయ కొట్టించారు. అనంతరం జయజయధ్వానాల మధ్య పార్టీ కొత్త జెండాను కేసీఆర్‌ తెలంగాణభవన్‌పై ఎగురవేశారు. గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ పరిసర ప్రాంతాలు అభిమానుల కేరింతలతో, బాణాసంచా కాల్పులతో దద్దరిల్లాయి. అనంతరం భారాస ఆవిర్భావ సమావేశం.. పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తొలి పలుకులతో ప్రారంభమైంది. తర్వాత లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, దయాకర్‌రావు, మల్లారెడ్డి, కమలాకర్‌, పువ్వాడ అజయ్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, జిల్లా పరిషత్‌, రైతుబంధు సమితుల ఛైర్‌పర్సన్లు, జాతీయ రైతుసంఘాల నాయకులు, హరియాణ నుంచి గుర్నామ్‌ సింగ్‌, ఒడిశా నుంచి అక్షయ్‌కుమార్‌, హిమాంశు తదితరులు పాల్గొన్నారు. వేడుక అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సతీమణి శోభ హారతి పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారందరికీ విందు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని