సీఎం పీఠం కోసం హిమాచల్‌లో కాంగ్రెస్‌ నేతల తీవ్రపోటీ

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌.. ముఖ్యమంత్రి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.

Updated : 10 Dec 2022 06:00 IST

నిర్ణయాధికారం అధిష్ఠానానికి..  

పార్టీ అధ్యక్షుడికి బాధ్యత అప్పగింత

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌.. ముఖ్యమంత్రి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ పదవి కోసం నేతల మధ్య పోటీ తీవ్రం కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇక్కడ సమావేశమైన పార్టీ కొత్త ఎమ్మెల్యేలు.. సీఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి రాజీవ్‌ శుక్లా ఈ విషయాన్ని ప్రకటించారు. అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడాలు ఈ అంశంపై తమ నివేదికను శనివారం అధినాయకత్వానికి సమర్పిస్తారని చెప్పారు. సీఎం పదవి కోసం పోటీపడుతున్న పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌, శాసనసభాపక్ష మాజీ నేత ముకేశ్‌ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కులు ఈ భేటీలో పాల్గొన్నారు. వారి మద్దతుదారులు అక్కడ బలప్రదర్శనకు దిగారు. తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్‌లో వర్గపోరు లేదని శుక్లా చెప్పారు. అంతకుముందు పార్టీ పరిశీలకులు ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలతో విడిగా సమావేశమై, వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. ప్రతిభా సింగ్‌ అనుచరులు.. పార్టీ పరిశీలకుల వాహనాన్ని కొద్దిసేపు అడ్డుకొని, వీరభద్రసింగ్‌ కుటుంబానికే సీఎం పదవిని ఇవ్వాలని నినాదాలు చేశారు. శిమ్లాలో కాంగ్రెస్‌ కార్యాలయం వెలుపల కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. మరోవైపు పార్టీ పరిశీలకులు.. గవర్నర్‌ విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు లాంఛన విజ్ఞప్తికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు అందజేశారు.

పోటీలో ఉన్నా: ప్రతిభాసింగ్‌

సీఎం పదవిని తాను ఆశిస్తున్నట్లు ప్రతిభా సింగ్‌ పేర్కొన్నారు. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. ఈ అంశంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడతామన్నారు. ‘‘పదవులు మాకు ముఖ్యం కాదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రధానం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2-3 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని సుఖ్వీందర్‌.. విలేకరులకు తెలిపారు. హిమాచల్‌లో సీఎం ఎంపికపై ఏకాభిప్రాయ సాధనకు పార్టీ పరిశీలకుల ద్వారా కొత్త ఎమ్మెల్యేల మనోగతాన్ని తెలుసుకుంటున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిల్లీలో తెలిపారు. దీనికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని