భాజపాకు వణుకు పుట్టిస్తాం

జాతీయ పార్టీగా భారత్‌ రాష్ట్ర సమితికి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలోని భాజపాకు వణుకు పుట్టిస్తామన్నారు. రానున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కీలకంగా మారతామని తెలిపారు.

Updated : 11 Dec 2022 07:13 IST

దిల్లీ పర్యటన ముగిశాక శాసనసభ సమావేశాలపై నిర్ణయం
మంత్రిమండలి భేటీలో కేసీఆర్‌
గవర్నర్‌ తీరుపై అసంతృప్తి

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పార్టీగా భారత్‌ రాష్ట్ర సమితికి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలోని భాజపాకు వణుకు పుట్టిస్తామన్నారు. రానున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కీలకంగా మారతామని తెలిపారు. దిల్లీ పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణలో శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వ ఎజెండా ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు. సుముహూర్తంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) అవతరించిందని, దేశ రాజకీయాల్లో ఇది సంచలనం సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘దేశభవిష్యత్తును మార్చడానికి భారాస పుట్టింది. ఆవిర్భావ వేడుకలు ముగిసిన వెంటనే దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రముఖులు ఫోన్‌ చేసి మాట్లాడారు. దేశంలో రాజకీయ శూన్యతను భారాస మాత్రమే పూడ్చగలదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమయింది. మన ముందున్న లక్ష్యం కర్ణాటక శాసనసభ ఎన్నికలు. జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తాం. మాజీ సీఎం కుమారస్వామికి అన్ని విధాలా సహకరిస్తాం. దాదాపు పది జిల్లాల్లో భారాస ప్రభావం ఉంటుంది.ఊహించని విధంగా మనకు స్థానాలు వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటులో మన పాత్ర ఉంటుంది. రాష్ట్ర సరిహద్దుల్లోని మన ఎంపీలు, ఎమ్మెల్యేలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. ఇటీవలి ఎన్నికల్లో గుజరాత్‌లో మాత్రమే భాజపాకు మంచి ఫలితాలు వచ్చాయి. హిమాచల్‌ప్రదేశ్‌ను కోల్పోయింది. ఉప ఎన్నికల్లోనూ భాజపాకు చేదు ఫలితాలే వచ్చాయి. మున్ముందు ఆ పార్టీకి మరిన్ని కష్టాలు వస్తాయి. కర్ణాటకపైనా ఆ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే. ఎమ్మెల్యేల ఎర కేసులో భాజపా నిర్వాకాలపై మరిన్ని నిజాలు బయటికి వస్తాయి. భారాస ఆవిర్భావంతో కాంగ్రెస్‌లో కలవరం ఏర్పడింది.

జాతీయ అంశాలపై దృష్టి

ఈ నెల 14న దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మంత్రులంతా...ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలి. 14 తర్వాత పార్టీపరంగా జాతీయ అంశాలపై దృష్టి సారిద్దాం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను దిల్లీలో ఎండగడతాం. దిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుందాం’’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.

గవర్నర్‌ అంశంపై చర్చ

తెలంగాణ అభివృద్ధి, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏడు బిల్లులను గవర్నర్‌ పెండింగులో పెట్టడంపై సీఎం, మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో 1066 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, దాంతో పాటు మరో వెయ్యి సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నామని, గవర్నర్‌ ఈ బిల్లులను పెండింగులో పెట్టడంతో నియామకాలు నిలిచిపోయాయని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. బిల్లుల ఆమోదానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నిపుణులతో చర్చించాలని ఈ  సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. కేరళ, తమిళనాడు మాదిరే విశ్వవిద్యాలయాల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించాలని ఈ సందర్భంగా కొందరు మంత్రులు కోరినట్లు తెలిసింది. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు