Nadendla Manohar: పొత్తులపై త్వరలోనే ప్రకటన: నాదెండ్ల మనోహర్‌

ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12న రణస్థలంలో ‘యువశక్తి’ పేరిట నిర్వహించనున్న కార్యక్రమం గోడపత్రికను ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు.

Updated : 12 Dec 2022 09:17 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12న రణస్థలంలో ‘యువశక్తి’ పేరిట నిర్వహించనున్న కార్యక్రమం గోడపత్రికను ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ‘మార్చి 14న ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో పవన్‌కల్యాణ్‌ వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం అంతా కలిసికట్టుగా ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు మా వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక, ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతున్నామో అందరికీ పారదర్శకంగా తెలియజేస్తాం’ అని చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మభ్యపెట్టిందని ఆరోపించారు. వైకాపా వ్యవహారాల కోసం కొత్తగా ఐదు లక్షల మంది గృహసారథులను నియమిస్తామంటున్నారని, అది ప్రజాస్వామ్యబద్ధం కాదన్నారు. ఆయన వెంట పార్టీ ముఖ్యనాయకులు, ఉత్తరాంధ్ర జిల్లాల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ఉన్నారు.


సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సమాయత్తమవుతోందని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకుల నియామకాన్ని పూర్తిచేశామన్నారు. తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 32 మంది పేర్లతో కూడిన కార్యనిర్వాహకుల జాబితాను ఆయన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని