Sajjala: రుషికొండ ఏమైనా అంతర్జాతీయ సమస్యా?

‘రుషికొండపై టన్నులు, కేజీలని లెక్కగట్టి తవ్వాలా?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Updated : 13 Dec 2022 10:03 IST

గుట్టను టన్నుల్లెక్కన లెక్కగట్టి తవ్వాలా?
ఆ కొండపై గతంలో నిర్మాణాలు లేవా?
కక్ష రాజకీయాలెవరివో భారాస వాళ్లే చెప్పాలి
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘రుషికొండపై టన్నులు, కేజీలని లెక్కగట్టి తవ్వాలా?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అనుమతికి మించి కొండను తవ్వుతున్నారనే దానిపై ఆయన స్పందించారు. రుషికొండపై జల ఉద్యమకారుడు రాజేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ‘పొద్దుపోని వ్యాఖ్యలుగా’ సజ్జల అభివర్ణించారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నవారు ఇలాంటివారిని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాజేంద్రసింగ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ప్రభుత్వాన్ని మించిన వ్యవస్థ ఏముంటుంది? ప్రభుత్వమనే రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు.. మిలీనియం టవర్స్‌, రామానాయుడు స్టూడియో ఎక్కడున్నాయి? అప్పట్లో రోడ్లన్నీ ఎడాపెడా వేయలేదా? రాజేంద్రసింగ్‌ గతంలో అమరావతికి వచ్చినపుడు అక్కడ విధ్వంసం జరిగిందని మాట్లాడినట్లున్నారు కదా? రుషికొండ గుట్ట ఏమైనా అంతర్జాతీయ సమస్యా? రాజధాని పేరుతో గత ప్రభుత్వం అమరావతిలో చేసినదే విధ్వంసం అంటే! దాదాపు 33,000 ఎకరాల పచ్చని పొలాలను తొలగించారు. అమరావతిలో జీవన విధానాన్నే దెబ్బతీశారు. రుషికొండలో అంతకుముందు నుంచే నిర్మాణాలున్నాయి.. ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. జగన్‌ పాలన అస్తవ్యస్తంగా ఉందన్న కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ నాయకుడిగా ఆ పార్టీ తరఫునే ఆయన మాట్లాడి ఉంటారనుకుంటున్నాం, వాటికి రాజకీయంగా సమాధానమిస్తాం.. ఆ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.

ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు

‘కక్ష రాజకీయాలకు సెలవు’ అంటూ ‘భారత రాష్ట్ర సమితి’ పేరుతో విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు ఎవరినుద్దేశించి అని అడగ్గా.. ‘ఆ విషయాన్ని వాళ్లనే (భారాస) అడగండి. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. ఒకవేళ కేసీఆర్‌ మద్దతు కోరితే, మా నాయకుడు జగన్‌ పార్టీలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇంకొకరి సాయం తీసుకుని ఇక్కడేదో చేయాలని, లేదా పొత్తులు పెట్టుకుని ఇక్కడ అధికారంలోకి రావాలనే ఆలోచనే లేదు.. మా పార్టీ ఏది చేసినా ఒంటిగానే చేస్తుంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయం

విభజన సమస్యలపై పోరాడతామంటున్న భారాసతో కలిసి వెళతారా అని అడగ్గా.. ‘అవసరం లేదు.. ఏ వేదిక దొరికినా హామీల అమలుపై అడుగుతున్నాం.. పోరాటమంటే యుద్ధం చేయడమని కాదు.. నలుగురు కలిసేవారున్నారు కాబట్టి వారందరితో కలిసివెళ్లి అడిగితే ఏదో అవుతుందనే భ్రమల్లేవు మాకు.. ప్రభుత్వంతో ప్రభుత్వంగా ఎలా డీల్‌ చేయాలో అలా చేస్తాం’ అని సజ్జల చెప్పారు. ‘కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచన లేదు.. అలాగైతే తెలంగాణలోనే చేసి ఉండేవాళ్లం కదా?’ అని అన్నారు.

65 సీన్ల సినిమా అనుకుంటున్నారు

‘పవన్‌ కల్యాణ్‌ రాజకీయమంటే 65 సీన్ల సినిమా అనుకుంటున్నారు.. వారాహి అంటూ ఏదో ఒక ట్యాంకర్‌ను తెచ్చి రాజకీయాలు చేయడం ద్వారా   ఏదో సాధిస్తారనుకుంటున్నారేమో! సాంకేతికంగా ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ జరగదని మా వాళ్లు చెప్పిందే ఇప్పుడు వాస్తమైంది కదా?’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు