Mahua moitra: ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నిలదీత

దేశ పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోందన్న సమాచారం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated : 14 Dec 2022 07:31 IST

పారిశ్రామికోత్పత్తి నేలచూపులపై విమర్శలు

దిల్లీ: దేశ పారిశ్రామికోత్పత్తి క్షీణిస్తోందన్న సమాచారం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ఆక్షేపించారు. ఈ క్రమంలో ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. లోక్‌సభలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..‘‘పప్పు అనే పదాన్ని ప్రస్తుత ప్రభుత్వం, అధికార పార్టీ సృష్టించాయి. తీవ్ర అసమర్థతను చూపడానికి, కించపరచడానికి దానిని ఉపయోగించారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పో వెల్లడిస్తున్నాయి’’ అని మొయిత్రా పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ మోదీ ప్రభుత్వాన్ని నిందించారు. నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన తాజా గణాంకాల మేరకు అక్టోబరు నెల దేశ పారిశ్రామికోత్పత్తి 5.6 శాతం నమోదై 26 నెలల కనిష్ఠానికి పరిమితమైంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండ్లను షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్టీలకతీతంగా రాజ్యసభలో సభ్యులంతా మద్దతు పలికారు. చందౌలి, కుషినగర్‌, సంత్‌ కబీర్‌నగర్‌, సంత్‌ రవిదాస్‌ నగర్‌ జిల్లాల నుంచి వలసపోయిన గోండ్లు ఇప్పటి వరకూ షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో ఉన్నారు.  

జాతీయ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కింద ఈ నెల 7వ తేదీ నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 6.91 లక్షల కొవిషీల్డ్‌, 86.45 లక్షల కొవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. ప్రభుత్వ ముందస్తు నిల్వల్లో అతి త్వరలో గడువు ముగిసే టీకాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.

రైలు ప్రయాణం చేసే వృద్ధులకు టికెట్‌పై 40 శాతం రాయితీని తిరిగి పునరుద్ధరించాలని భాజపా ఎంపీ కైలాశ్‌ సోనీ మంగళవారం రాజ్యసభలో కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఈ రాయితీని రైల్వే ఎత్తేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని