Published : 01/03/2021 04:10 IST

హంగ్‌ వస్తే.. భాజపాతో మమత పొత్తు

ఈ రెండు పార్టీలతో బెంగాల్‌కు ప్రమాదం
గతంలో ఎన్డీయేలో టీఎంసీ భాగస్వామి
కోల్‌కతా సభలో సీతారాం ఏచూరి
ఎన్నికల శంఖం పూరించిన లెఫ్ట్‌-కాంగ్రెస్‌-ఐఎస్‌ఎఫ్‌

కోల్‌కతా: ఆరెస్సెస్‌-భాజపా మత ఎజెండాను అపాలంటే బెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)ని ఓడించాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈ రెండు పార్టీలతో బెంగాల్‌కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బెంగాల్‌ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఆదివారం లెఫ్ట్‌- కాంగ్రెస్‌- ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) కలిసి ఎన్నికల శంఖారావం పూరించాయి. భారీగా జనసమీకరణ చేసి బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఏచూరి మాట్లాడుతూ.. ‘‘హంగ్‌ ఏర్పడితే ఏమవుతుందని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న.. టీఎంసీని అడగమని చెబుతున్నా. గతంలో చాలా సందర్భాల్లో ఎన్‌డీఏలో టీఎంసీ భాగస్వామిగా ఉంది. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే కచ్చితంగా భాజపాతో కలిసి బెంగాల్లో తృణమూల్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ అని తెలిపారు. కొవిడ్‌-19 కోసం వసూలు చేసిన పీఎం కేర్స్‌ నిధులను ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు భాజపా వాడుతోందని ఏచూరి ఆరోపించారు. అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీ.. క్రికెట్‌ స్టేడియానికి నరేంద్ర మోదీ పేరెందుకు పెట్టిందో, క్రికెట్‌ సంఘంలో అమిత్‌ షా కుమారుడు సభ్యుడిగా ఎందుకు సాగుతున్నాడో చెప్పాలని సీతారాం డిమాండ్‌ చేశారు. ఇదే సభలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ కూడా మాట్లాడారు. దేశాన్ని అమ్మే ప్రసక్తే లేదని  గతంలో చెప్పిన మోదీ, ఇప్పుడెందుకు రైల్వేలు, విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధురి మాట్లాడుతూ.. రానున్న బెంగాల్‌ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ కలిసి భాజపా, టీఎంసీని ఓడిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమత అహంకారానికి బెంగాల్‌ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఐఎస్‌ఎఫ్‌ నేత అబ్బాస్‌ సిద్ధికీ అన్నారు. లెఫ్ట్‌ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రావడానికి తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు.

లెఫ్ట్‌ కూటమి నిలుస్తుందా?

కోల్‌కతా: బెంగాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌-లెఫ్ట్‌-ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌) కూటమి ప్రయాణం సజావుగా సాగేలా లేదు. ఆదివారం ఆ కూటమి తొలి బహిరంగ సభలో కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. బహిరంగ సభలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ఐఎస్‌ఎఫ్‌ నేత అబ్బాస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ ఛౌదరీ మాట్లాడుతున్నప్పుడు అబ్బాస్‌ సభావేదికపైకి వచ్చారు. దీంతో అందరి దృష్టి అబ్బాస్‌ వైపు మళ్లింది. వామపక్ష నాయకులు కూడా అబ్బాస్‌తో కరచాలనానికే ప్రాముఖ్యతఇచ్చారు. దీంతో అధీర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగింది. తర్వాత తన ప్రసంగంలో అబ్బాస్‌ కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. తానిక్కడ ఎవరినీ సంతృప్తి పరచడానికి రాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. తన హక్కులను మాత్రమే డిమాండ్‌ చేస్తున్నానని తెలిపారు. వామపక్ష నేతలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇటీవల సిద్ధికీ.. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం నుంచి బయటికి వచ్చి మహా కూటమితో చేతులు కలిపారు. కాగా సభ ముగిసిన తర్వాత అబ్బాస్‌ మాట్లాడుతూ.. మహాకూటమికి సోనియా గాంధీ సుముఖంగానే ఉన్నా.. స్థానిక నాయకుల కారణంగానే ఆలస్యమైందని వ్యాఖ్యానించడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని