Updated : 31/03/2021 04:50 IST

నాడు వద్దన్నదే నేడు ముద్దు!

పారిశ్రామికీకరణ కోరుతున్న నందిగ్రామ్‌  
 విభజన రాజకీయాల్లో పార్టీలు

నందిగ్రామ్‌- బలమైన వామపక్షాలను కూల్చేయడానికి కారణమైన చోటు! దాదాపు 15 ఏళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం ఓ కెమికల్‌ పరిశ్రమల కేంద్రంగా చేయాలని యోచించినప్పుడు... నందిగ్రామ్‌ తీవ్రంగా తిరగబడింది. ఆ తిరుగుబాటు చివరకు వామపక్షాల అస్థిత్వానికే ముప్పుతెచ్చింది. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడదే నందిగ్రామ్‌ ఉద్యోగాల కోసం పరిశ్రమలు కావాలంటోంది. రాజకీయ పార్టీలు మాత్రం అస్తిత్వ, ఆధిపత్య పోరులో... ప్రజల్ని ఉద్వేగాల్లో పడవేసి విభజన రాజకీయాల్లో ముంచి తేలుస్తున్నాయి.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఒకప్పుడు ఆమె కుడిభుజం, ఇప్పుడు భాజపా అభ్యర్థి సువేందు అధికారి మధ్య పోరుతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక నియోజకవర్గంగా మారిందీ నందిగ్రామ్‌! ఇరువురు అభ్యర్థుల రాజకీయ అస్థిత్వానికి, ప్రతిష్ఠకు ఏప్రిల్‌ 1న జరిగే ఈ ఎన్నిక కీలకంగా మారడంతో అన్ని పావులూ ప్రయోగిస్తున్నారు. ఫలితంగా నందిగ్రామ్‌ గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ, మతపరమైన విభజనను చూస్తోంది.


స్థానిక, స్థానికేతర వివాదం

నందిగ్రామ్‌లో మమతను స్థానికేతరురాలిగా సువేందు అభివర్ణిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ ప్రాంతాలోని మూణ్నాలుగు జిల్లాల్లో ఆయన కుటుంబానికి మంచి పట్టుంది. అందుకే... తాము లోకల్‌ అని, మమత బయటి నుంచి వచ్చిన వ్యక్తి అని సువేందు ప్రచారం చేస్తున్నారు. దీనికి మమత ‘మీర్‌ జాఫర్‌’ (బెంగాల్‌ చివరి నవాబు సిరాజ్‌ ఉద్‌ దౌలా సైనికాధికారిపేరు. జాఫర్‌ మోసం వల్లే ఆనాడు ప్లాసీ యుద్ధంలో ఈస్టిండీయా కంపెనీ నెగ్గిందంటారు) పోలికతో... సువేందును ద్రోహిగా నిందిస్తున్నారు. అంతేగాకుండా ‘బెంగాల్‌ తన కూతురును కోరుకుంటుందంటూ...’ తాను బయటి వ్యక్తిని కాదని, మీ బిడ్డనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ప్రజలు నలిగిపోయే పరిస్థితి. కొన్నేళ్ల కిందట తమ పోరాటానికి మద్దతిచ్చిన మమత; రెండోవైపు ఆమె అనుంగుగా ఉంటూ ఇక్కడే ఉండి ఉద్యమాన్ని నిర్మించిన తమ నేత సువేందు... వీరిలో ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తికరం! ఇక్కడే ప్రవేశించింది మతపరమైన విభజన రాజకీయం!


30 శాతం మైనార్టీలు

నందిగ్రామ్‌ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 30 శాతం వరకూ ఉన్నాయి. నియోజకవర్గంలోని మొదటి బ్లాకులో 35 శాతం; రెండో బ్లాకులో 15 శాతం మైనార్టీ ఓట్లుంటాయి. నందిగ్రామ్‌ 1950ల నుంచి 2007 దాకా వామపక్షాల కంచుకోట. ఆ తర్వాత తృణమూల్‌ ఖాతాలోకి వెళ్ళింది. సువేందు ఇన్నిరోజులూ అక్కడి నుంచే తృణమూల్‌ అభ్యర్థిగా ఉన్నారు. నిజానికి 2015 నుంచే ఇక్కడ మతపరమైన విభజన మొదలైంది. 2016 ఉప ఎన్నికలో భాజపా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు సువేందు భాజపాలో చేరడంతో వారి బలం మరింత పెరిగింది. ముస్లిం ఓట్లన్నీ తమకే లభిస్తాయనేది మమత ధీమా. కానీ కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ కూటమి తరఫున సీపీఎం అభ్యర్థి, యువనేత మీనాక్షి ముఖర్జీ బరిలో ఉన్నారు. దీంతో- మమత మిగిలిన హిందూ ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సభల్లో తనను తాను హిందూవాదిగా అభివర్ణించుకుంటూ శ్లోకాలు పఠిస్తున్నారు. సామాన్య ప్రజలు మాత్రం ఈ రాజకీయం కంటే తమకు, తమ పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి చూపించే పరిశ్రమలు కావాలని కోరుకుటుండటం గమనార్హం. ‘‘మా పిల్లలు చాలా రాష్ట్రాలకు వలస వెళ్లి పొట్టపోసుకుంటున్నారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇకనైనా ఈ ప్రాంతానికి పరిశ్రమలు కావాలి’’ అని కృష్ణేందు మొండల్‌ అనే రైతు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలతో మమత, సువేందు భవితవ్యం తేలుతుంది. మరి నందిగ్రామ్‌ది ఎప్పుడు తేలేనో?


దీదీకి అంత సులువు కాదు!

ఇన్నాళ్లూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తృణమూల్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన మమత.. మూడురోజులుగా నందిగ్రామ్‌లోనే మకాం వేశారు. అక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే- సువేందుపై విజయం ఆమెకు అంత తేలికగా దక్కేలా కనిపించడం లేదు. నియోజకవర్గంలో మమతకు ఉన్న ప్రతికూలతలు, అనుకూలతలను ఓసారి పరిశీలిస్తే..


ప్రతికూలతలు

* తృణమూల్‌ బలాలు, బలహీనతలన్నీ తెలిసిన సువేందు ప్రత్యర్థిగా ఉండటం
* స్థానికురాలు కాదన్న ప్రచారం
* ముస్లింల ఓట్లను వామపక్షాలు-కాంగ్రెస్‌-ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ కూటమి లాగేసుకునే అవకాశం
* పదేళ్లుగా అధికారంలో ఉన్నా.. నందిగ్రామ్‌ను అభివృద్ధి పథంలో నడిపించలేదన్న విమర్శలు


అనుకూలతలు

* ఒకప్పుడు నందిగ్రామ్‌ పోరాటాన్ని ముందుండి నడిపించారన్న పేరు
* ప్రత్యామ్నాయంగా మరే నియోజకవర్గంలోనూ బరిలో దిగకుండా, నందిగ్రామ్‌లో మాత్రమే దీదీ పోటీ చేస్తుండటంతో స్థానికంగా తృణమూల్‌ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తుండటం
* ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, ఆర్జేడీ అగ్ర నేత తేజస్వీ యాదవ్‌ వంటి నాయకులతో పాటు యోగేంద్ర యాదవ్‌, మేధా పాట్కర్‌ వంటి ప్రముఖులు మమతకు మద్దతు పలుకుతుండటం

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని