Updated : 12/09/2021 05:40 IST

విజయ తీరాలకు చేర్చలేరు!

 భాజపా అంతర్గత సర్వేలో వెల్లడి
రూపాణీ తొలగింపు అందుకే

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీని తొలగించడానికి తక్షణ కారణం ఏమిటన్నదానిపై స్పష్టత లేకపోయినా పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే ఫలితాలే కారణమని తెలుస్తోంది. కరోనాను సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయ. ప్రధాన వర్గంగా ఉన్న పాటీదార్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండడం, ప్రత్యామ్నాయంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ బలపడుతుండడం పార్టీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలో రూపాణీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే విజయావకాశాలు తక్కువని భాజపా నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలినట్టు సమాచారం.

మృదుభాషిపై బలహీన ముద్ర

మృదుభాషి అయిన రూపాణీపై ‘బలహీన సీఎం’ అన్న ముద్ర పడిందని, ఇది కూడా ఇంకో కారణమని చెబుతున్నారు. రాజకీయ నాయకులను కాదని, అధికారుల మాట మేరకు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆయనపై బలహీన సీఎం అన్న విమర్శలు వచ్చాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడం కూడా పార్టీ విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణమయింది.

పాటిల్‌తో విభేదాలూ కూడా...

భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, నవసారీ నియోజకవర్గం ఎంపీ అయిన సి.ఆర్‌.పాటిల్‌తో ఏర్పడ్డ విభేదాలు రూపాణీ పదవికి ఎసరుపెట్టాయి. పార్టీ నాయకత్వం కల్పించుకొన్నా సర్దుబాటు కాలేదు. ప్రభుత్వం, పార్టీల మధ్య సంబంధాలు ఉండేందుకు మంత్రులతో వేసిన సలహా కమిటీలో కేంద్ర నాయకత్వం పాటిల్‌కు కూడా చోటు కల్పించింది. ఆయన ఇచ్చిన సలహాలను పాటించలేదు. పాటిల్‌తో పోల్చితే రూపాణీకి కార్యకర్తలతో సంబంధాలు తక్కువే. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించినా అవి మోదీ పేరున జరగడంతో రూపాణీ ఖాతాలో చేరలేదు. మరోవైపు ఆప్‌నకు ఎలాంటి సీట్లు రానప్పటికీ 13.28% ఓట్లు సంపాదించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా ఉండడంతో భాజపాకు ప్రత్యామ్నాయం ప్రచారం చేసుకుంటూ పటేళ్లకు కీలకమైన పార్టీ పదవులు అప్పగిస్తోంది. అందువల్ల నాయకత్వాన్ని మార్చడమే మంచిదని పార్టీ భావించినట్టు విశ్లేషిస్తున్నారు.
పరిపాలనలో రూపాణీ వైఫల్యం చెందారంటే అందుకు బాధ్యత నరేంద్ర మోదీ-అమిత్‌షాలదేనని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. భాజపాలోని అంతర్గత కలహాలే ముఖ్యమంత్రుల మార్పునకు కారణమని విమర్శించింది.

ఆరు నెలల్లో నలుగురు సీఎంలు

ఎన్నికలు సమీపిస్తుండడంతో భాజపా ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రమంత్రివర్గంతో పాటు, ముఖ్యమంత్రుల భారీ మార్పులు ఇందులో భాగమే. పరిపాలన, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి వస్తున్న నివేదికల ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. ఇందుకోసం... ‘‘ముఖ్యమంత్రులపై అసంతృప్తి వ్యక్తమయితే వెంటనే గుర్తించి దాన్ని పరిష్కరించాలి. ఆలస్యం చేయకూడదు’’ అన్న ఒకే ఒక్క సూత్రాన్ని అమలు చేస్తోంది. ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే గత ఆరు నెలల్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. తాజాగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాణీని మార్చడం కూడా ఈ కోవలోనిదే. ప్రస్తుతం ఆయన సమర్థతపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, వాటి ఆధారంగా కాకుండా సామాజిక సమీకరణాల కోణంలోనే ప్రధాన నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిగిలిన రాష్ట్రాలను పరిశీలిస్తే...

ఎన్నికలకు సంసిద్ధతలో భాగంగానే ఉత్తరాఖండ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చారు. ఉత్తరాఖండ్‌లో తొలుత త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను ముఖ్యమంత్రిగా తొలగించారు. ఆయన స్థానంలో తీరథ్‌ సింగ్‌ రావత్‌ను నిమమించినా నాలుగు నెలలు కూడా కొనసాగలేదు. ఆయనను తొలగించి పుష్కర్‌ సింగ్‌ ధామీని నియమించారు. అందరిదీ ఒకే సామాజిక వర్గం కావడం విశేషం. కర్ణాటకలో యడియూరప్పపై పార్టీలో అసంతృప్తి వ్యక్తం కావడంతో.. ఆయనను తొలగించారు. లింగాయత్‌ సామాజిక వర్గం దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఆయన అనుచరుడైన బసవరాజ్‌ బొమ్మైకి బాధ్యతలు అప్పజెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని