కళంకితులకు అగ్ర తాంబూలమా?

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌లో కొత్త అలజడి సృష్టించిన నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాష్ట్రంలో తాత్కాలిక డీజీపీ, అ

Updated : 30 Sep 2021 10:17 IST

పలువురి నియామకాలను ప్రశ్నించిన సిద్ధూ
రాజీ పడలేకే రాజీనామా చేసినట్లు వెల్లడి

చండీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్‌లో కొత్త అలజడి సృష్టించిన నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాష్ట్రంలో తాత్కాలిక డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్‌ల నియామకంపై తన అసంతృప్తిని బయటపెట్టారు. మంత్రివర్గంలో కళంకితులకు చోటుదక్కడమూ తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నారు. పంజాబ్‌ సంక్షేమంపై రాజీ పడటం ఇష్టం లేకే రాజీనామా చేసినట్లు తెలిపారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను ట్విటర్‌లో ఆయన బుధవారం పోస్ట్‌ చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని స్పష్టం చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోతాను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా నియమించడంపై సిద్ధూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఓ కేసులో ఆరేళ్ల క్రితం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కుటుంబ సభ్యులకు క్లీన్‌చిట్‌ ఇచ్చినవారికే.. ఇప్పుడు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇసుక కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన మంత్రి రాణాగుర్జీత్‌సింగ్‌కు మరోసారి కేబినెట్‌లో చోటు కల్పించడంపై కూడా మండిపడ్డారు. కళంకితులకు మళ్లీ కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు బుధవారం పటియాలాలోని సిద్ధూ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.

సిద్ధూతో మాట్లాడిన సీఎం

రాష్ట్రంలో పలు నియామకాలపై అలకబూనిన సిద్ధూతో పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు.  ‘‘పార్టీ అత్యున్నతం. దాని సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సిద్ధూను  కోరాను. త్వరలో భేటీ అవుదామని ఆయన బదులిచ్చారు’’ అని కేబినెట్‌ భేటీ అనంతరం విలేకర్లతో చన్నీ పేర్కొన్నారు. మరోవైపు.. పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని రాష్ట్రంలోనే పరిష్కరించుకోవాల్సిందిగా సీఎం చరణ్‌జీత్‌కు  కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని