వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే అబద్ధాలు

పంజాబ్‌లో పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు.

Updated : 03 Oct 2021 10:21 IST

కాంగ్రెస్‌పై అమరీందర్‌ విమర్శలు

చండీగఢ్‌: పంజాబ్‌లో పార్టీ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు. పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు కెప్టెన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించడం వల్లే ఆయన సీఎం పదవి వదులుకోవాల్సి వచ్చిందంటూ... కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించడంపై అమరీందర్‌ స్పందించారు. ‘‘43 మంది ఎమ్మెల్యేలు నా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ అన్నారు. సూర్జేవాలా ఆ సంఖ్యను 78గా చెప్పారు. తర్వాత మొత్తం 117 మంది శాసనసభ్యులు నాకు వ్యతిరేకంగా లేఖ రాశారని కూడా అంటారు. పార్టీలో వ్యవహారాలకు ఈ పరిహాసమే నిదర్శనం. కనీసం, అబద్ధాలు చెప్పేందుకైనా వారు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అందరూ నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ హాస్య ప్రదర్శనలో మునిగిపోయినట్టున్నారు. కాంగ్రెస్‌లో పరిస్థితులు రోజురోజుకూ గందరగోళంగా మారుతున్నాయి. పార్టీ వ్యవహార శైలిపై సీనియర్‌ నాయకుల్లో ఎక్కువమంది అసంతృప్తిగా ఉన్నారు’’ అని అమరీందర్‌ పేర్కొన్నారు.

అమరీందర్‌ను సోనియా తొలగించలేదు: రణ్‌దీప్‌ సూర్జేవాలా

చండీగఢ్‌: ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తొలగించలేదని, 78 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం వల్లే ఆయన పదవిని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం తనను అవమానించిందని అమరీందర్‌ ఆరోపించిన క్రమంలో, సూర్జేవాలా శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘పంజాబ్‌కు చెందిన 79 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 78 మంది అమరీందర్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు వారు లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో తొలిసారి ఒక దళితుడికి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. భాజపాలో ఎవరైనా దళిత సీఎం ఉన్నారా? భాజపా పాలిత గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు జరగలేదా? ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దిల్లీకి రావడం పార్టీ అంతర్గత వ్యవహారం’’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని