మాతో టచ్‌లో తెరాస, కాంగ్రెస్‌ నేతలు

ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని.. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి,

Published : 27 Nov 2021 03:52 IST

సీఎం కేసీఆర్‌కు దిల్లీలో షాక్‌ తగిలింది

రాష్ట్రంలో  కాంగ్రెస్‌ అధ్యాయం ముగిసింది

విలేకరులతో ఇష్టాగోష్ఠిలో భాజపా ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని.. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపాదే విజయమని, తెరాసకు అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీది ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఇక్కడకు వచ్చిన తరుణ్‌ఛుగ్‌ విలేకరులతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ వెళ్లివచ్చిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘హడావిడి చేసి దిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎం అక్కడ ఏం చేశారు. దిల్లీలో కేసీఆర్‌కు షాక్‌ తగిలింది’ అని వ్యాఖ్యానించారు. భాజపాకు రాష్ట్రంలో 30 చోట్ల కూడా గట్టి అభ్యర్థులు లేరు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ- తెరాస, కాంగ్రెస్‌ల నుంచి రెండు డజన్ల మంది బలమైన నేతలు భాజపాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ‘ఎన్నికలు వస్తే మా సత్తా తెలుస్తుంది. 80 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం... ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు గట్టి అభ్యర్థులు 60 మంది కూడా దొరకరు’ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంటోంది కదా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, ‘రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక లిఫ్టు మాదిరి పైకి వెళ్లి కిందికి పడిపోయింది. కాంగ్రెస్‌ కోలుకోదు. ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్‌ లేదు’ అని పేర్కొన్నారు.

కరీంనగర్‌లో తెరాస ఓడిపోతుంది: ఈటల

తెరాసకు ఏకపక్ష విజయాలు దక్కకుండా చేస్తేనే సీఎం కేసీఆర్‌కు కనీస భయం ఉంటుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ‘కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో తెరాస ఓడిపోతుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అక్కడ గెలుస్తారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒకరితో నామినేషన్‌ వేయించా. కరీంనగర్‌ జిల్లాలో తెరాస ఖాళీ అవుతుంది’ అని అన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన ఈటల విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని