వరి రైతులకు శాపంగా భాజపా,తెరాస ప్రభుత్వాలు: ఉత్తమ్‌

తెలంగాణలోని వరి రైతులకు కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా, తెరాస ప్రభుత్వాలు శాపంగా మారాయని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Published : 30 Nov 2021 04:25 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని వరి రైతులకు కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా, తెరాస ప్రభుత్వాలు శాపంగా మారాయని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అక్టోబరు మొదటి వారంలో ప్రారంభించాల్సిన కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసింది. అకాల వర్షాలతో కల్లాల్లో వరి పంట మొలకలెత్తి రైతులు నష్టపోతున్నారు. పంజాబ్‌లో ఇదే సమయంలో 1.13 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా.. తెలంగాణలో పది లక్షల టన్నులే కొనుగోలు చేశారు. యాసంగి పంట కొంటామని, కొనబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి.ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్రం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్‌ చేయించి రూ.500 రాయితీతో ఎగుమతి చేస్తే మొత్తం ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది’’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో తెరాస ఎంపీలు నినాదాలు చేస్తుండడంతో అక్కడ కొనుగోళ్లు చేయమంటే.. ఇక్కడ నినాదాలు చేయడం విడ్డూరంగా ఉందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.  
- విలేకరుల సమావేశం అనంతరం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు.. ‘వాట్‌ ఉత్తమ్‌.. మా నినాదాలతో నీకు ఇబ్బంది కలిగిందా?’ అని ప్రశ్నించారు. ‘అదేం లేదు.. మీరు అదే సమస్యపై నినాదాలు చేస్తున్నారుగా.. అందుకే నా సమావేశాన్ని కుదించుకున్నా’ అని ఉత్తమ్‌ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని