కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీతో జవాబు చెప్పించాలి

భాజపా నేతలకు దమ్ముంటే ధాన్యం సేకరణ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  తెలంగాణ రైతుల పక్షాన అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో, కేంద్రమంత్రులతో సమాధానం చెప్పించాలని, పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండు చేశారు.

Published : 01 Dec 2021 04:44 IST

మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నేతలకు దమ్ముంటే ధాన్యం సేకరణ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  తెలంగాణ రైతుల పక్షాన అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో, కేంద్రమంత్రులతో సమాధానం చెప్పించాలని, పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండు చేశారు. సీఎం సవాలు చేస్తే ఆయన స్థాయిలేని నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసేందుకే కేంద్రం కుట్రలకు తెరలేపిందన్నారు.మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం సేకరణకు కేంద్రం చేతులెత్తేయడంతో పాటు భాజపా నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి, చివరికి నవ్వుల పాలయ్యారు. కేంద్రమంత్రులదీ అదే ధోరణి.  దీనిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగితే భాజపా నేతల్లో వణుకు మొదలైంది. తెలంగాణ ప్రజల భావోద్వేగమే సీఎం మాటల్లో ప్రతిధ్వనించింది. దీనికి భాజపా నేతల నుంచి సమాధానం లేదు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో కేంద్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడి తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. తెలంగాణలోనే ధాన్యం దిగుబడి ఎందుకు పెరిగింది..? గుజరాత్‌లో ఎందుకు పెరగలేదు..? వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సింది ఎంపీలు కాదు.. కేంద్ర మంత్రులే. విద్యుత్‌ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేది మీరు కాదా..? వ్యవసాయ బోర్లు, బావులకు మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పింది మీరు కాదా..?’’ అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.

కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదు: జీవన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, ఇతర కేంద్రమంత్రుల మాదిరిగా రాజకీయ పర్యాటకునిగా వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయడం లేదని పీయూసీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘కిషన్‌రెడ్డి రాష్ట్రానికి  ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదు. నిధుల గురించి పట్టింపులేదు. చివరికి తెలంగాణ రైతులను సైతం మోసం చేశారు. రేవంత్‌రెడ్డి భాజపాకు నకలుగా మారారు’’ అని ఆరోపించారు.

భాజపాకి ప్రజలే వాతపెడతారు బాల్క సుమన్‌, సైదిరెడ్డి, సురేందర్‌

గుజరాత్‌ను తెలంగాణ దాటి పోతుందన్న అక్కసుతోనే భాజపా రైతులపై కక్ష కట్టిందని, పచ్చగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతోందని తెరాస విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జాజుల సురేందర్‌లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఆటలు సాగవని, ప్రజలు కర్రుకాల్చి ఆ పార్టీకి వాతలు పెడతారని అన్నారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు