Published : 01/12/2021 04:44 IST

మెడపై కత్తి అంటే ఏమిటి?

సీఎం కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి చెప్పాలి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్రలో భాజపా-తెరాస భాగమస్వాములేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న కాలయాపనతో కల్లాల్లోనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో పార్లమెంటులో చర్చజరగాలని, కనీస మద్దతు ధరపై చట్టంచేయాలని కాంగ్రెస్‌తోపాటు 18 పార్టీలు పట్టుపట్టగా, భాజపాతో జరిగిన అంతర్గత ఒప్పందంలో భాగంగా మూజువాణి ఓటుతో ఆ చట్టాల రద్దుకు తెరాస సహకరించిందని మండిపడ్డారు. ‘‘దిల్లీపై యుద్ధం చేస్తా..మెడలు వంచుతానంటూ’’ కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను  అబద్ధాలుగా అభివర్ణించారు. కొనుగోలు కేంద్రాలను మూసివేయడం అంటే రైతులు తమ పంటలను అంబానీ, అదానీలకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించడమేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే దిల్లీ జంతర్‌మంతర్‌లో సీఎం దీక్షచేయాలని, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని సూచించారు. ఆ దీక్షకు కాంగ్రెస్‌ కాపలా ఉంటుందన్నారు.

ఎలాంటి కత్తిపెట్టారు?

కేంద్రం మెడపై కత్తి పెడితే పారాబాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమంటూ లేఖ ఇచ్చామని కేసీఆర్‌ అనడాన్ని రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘మెడపై కత్తి పెడితే గజ్వేల్‌ ఫాంహౌస్‌ రాసిస్తారా? ముఖ్యమంత్రి పదవిని ఇతరులకు ఇస్తారా? కొడుకు, బిడ్డ, అల్లుడి పదవుల తీసేస్తారా?’’ అని సీఎంను ప్రశ్నించారు. ఇవన్నీ వదులుకోలేనప్పుడు తెలంగాణ రైతుల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ‘‘అసలు మెడపై కత్తి అంటే ఏమిటి? అవినీతిపై విచారణ చేస్తామని భయపెట్టారా? ఇంకేదైనా ఉందా? అనే విషయమై సీఎం స్పష్టతనివ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. సీఎం నీతిపరుడై ఉంటే దిల్లీపై యుద్ధం చేసేవారేనని, నరేంద్ర మోదీ మెడలు వంచేటోడేనని, కాకపోవడం వల్లనే కత్తిపెట్టగానే వెనకడుగు వేశారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో జరిగిన సమావేశానికి తెరాస హాజరైనంత మాత్రాన తెరాసను ఖర్గే సహా ఎవరూ కాపాడరన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నీడ కూడా కాంగ్రెస్‌ పార్టీపైన పడనివ్వమన్నారు.

కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలి

‘‘యాసంగి పంట కొనమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కేంద్రం కొనదు కాబట్టి నేను కొననని కేసీఆర్‌ చేతులు ఎత్తేశారు. కేంద్రమే పంట కొంటే మీ అవసరం ఏముంది. మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు?’’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని