పీవీ సునీల్‌తో ప్రాణాలకు ముప్పు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి మారుపేరుగా మారిన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌.. సీఎం జగన్‌తో కుమ్మక్కై తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు

Published : 15 Jan 2022 05:26 IST

జగన్‌తో కుమ్మక్కై  అంతమొందించేందుకు కుట్ర
ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి మారుపేరుగా మారిన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌.. సీఎం జగన్‌తో కుమ్మక్కై తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధాని మోదీకి 2పేజీల లేఖ రాశారు. ‘ఇటీవల సొంత పార్లమెంటు నియోజకవర్గం నరసాపురం వెళ్లాలనుకున్నప్పుడు అంతమొందించడానికి కుట్ర పన్నారు. వివిధ మత విధానాలను అనుసరిస్తున్న వారి ద్వారా ఎస్సీ కులాల మధ్య చిచ్చురేపి ఆ సందర్భంలో ఝార్ఖండ్‌ నుంచి తెప్పించిన గూండాల ద్వారా అల్లర్లు సృష్టించి ఆ అలజడి మధ్య నన్ను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిపై ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, హోంశాఖలకు వీడియోసాక్ష్యాలతో సహా ఫిర్యాదుచేశా. ఆ శాఖలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం కోరినా స్పందించలేదు. గతేడాది మే 14న అరెస్టు చేసినప్పుడు పోలీసు కస్టడీలో చిత్రహింసలుపెట్టి అంతమొందించాలన్న వారి ప్రయత్నం విఫలం కావడంతో మరోసారి అలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు. వీరిద్దరూ నాకు ప్రాణహాని తలపెట్టినట్లు స్వీయమార్గాలు, సామాజిక నిఘావర్గాల ద్వారా తెలిసింది. ఈ కుట్రలో ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాలుపంచుకున్నారు. నన్ను చిత్రహింసలకు గురిచేసిన సునీల్‌కుమార్‌పై గతేడాది జూన్‌ 2న లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. గత్యంతరం లేక మీకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది’ అని రఘురామ లేఖలో పేర్కొన్నారు.

* శుక్రవారం రఘురామకృష్ణరాజు దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌పై స్పందించిన లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ తనను దారుణంగా హింసించిన పోలీసులపై స్పందించకపోవడం పట్ల స్పీకర్‌ ఓంబిర్లాకు లేఖ రాసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు