నరసరావుపేట రణరంగం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు  తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించింది.

Updated : 17 Jan 2022 05:54 IST

ఏపీలో వైఎస్సార్‌ విగ్రహం మాయంపై కార్యకర్తలను అరెస్టు చేశారని తెదేపా ధర్నా
తోపులాటలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ అరవిందబాబుకు అస్వస్థత

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-నరసరావుపేట పట్టణం: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు  తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెదేపా-వైకాపా నాయకుల పోటాపోటీ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో నరసరావుపేట పట్టణం రణరంగాన్ని తలపించింది. వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు కేసులో తెదేపా కార్యకర్తలు అనిల్‌, రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారిని విడుదల చేయాలని తెదేపా నేత డాక్టర్‌ అరవిందబాబు శనివారం సాయంత్రం జొన్నలగడ్డ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి లేవదీస్తుండగా తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ పెనుగులాటలో అరవిందబాబు కిందపడి, అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను అంబులెన్సులో నరసరావుపేట తరలిస్తుండగా దారిలో వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ దాడిలో అంబులెన్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం అరవిందబాబును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. పార్టీ నాయకులు ఆదివారం ఉదయాన్నే పేటకు చేరుకుని పోలీసు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు.  తెదేపా రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు నరసరావుపేటకు వచ్చి అరవిందబాబును పరామర్శించారు.

పోలీసులేం చేస్తున్నారు: చంద్రబాబు
తెదేపా కార్యకర్తల అరెస్టుపై నిరసనలు తెలియజేసే వారిపై పోలీసులతో దాడి చేస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తెదేపా నేతలతో మాట్లాడారు ‘అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవిందబాబు, ఇతర నేతలపై పోలీసులే దౌర్జన్యం చేయడం వారి వైఖరికి అద్దం పడుతోంది. అస్వస్థతకు గురైన నాయకులను తరలించే అంబులెన్స్‌పైనా దాడికి దిగడం వైకాపా అరాచకానికి నిదర్శనం. ఇంత జరగుతుంటే పోలీసులేం చేస్తున్నారు.’ అని విమర్శించారు. ఘర్షణకు కారణమైన వైకాపా కార్యకర్తలతోపాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండు చేశారు. అరవిందబాబుతో తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. నిరసన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, వైకాపా కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు