ఎస్సీ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరాలి

రాష్ట్రంలోని 19 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. అంబేడ్కర్‌

Published : 18 Jan 2022 03:56 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 19 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. అంబేడ్కర్‌ జయంతి రోజున బహుజన పాదయాత్ర చేపట్టి కనీసం 2నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ‘మిషన్‌-19’ పేరిట నిర్వహించిన ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల తొలి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎస్సీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక అంశాన్ని జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ నియోజకవర్గాల్లో భాజపా ఓటు బ్యాంకు క్రమేణా పెరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని చొప్పదండి, మానకొండూరు ఎస్సీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు వరుసగా 9 శాతం, 2.52 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తరవాతి పార్లమెంటు ఎన్నికల్లో 61 శాతం, 51.5 శాతం ఓట్లు లభించాయి. ఎస్సీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలను భాజపా వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఉగాది నాటికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ ఛైర్మన్‌ ఎ.పి.జితేందర్‌రెడ్డి, సభ్యులు ఒంటేరు జైపాల్‌, సీహెచ్‌ విఠల్‌, కాంచన కృష్ణ, పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 19న జరగనుంది. అదే రోజు సాయంత్రం వివిధ మోర్చాల పదాధికారులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆన్‌లైన్‌లో సమావేశం కానున్నారు.రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి జరగాల్సిన బీడీఎస్‌ పరీక్షలను వాయిదా వేయాలని సంజయ్‌ ఒక ప్రకటనలో కోరారు.

నేతల ప్రత్యేక సమావేశాలపై ఆరా...

కొంతమంది భాజపా నాయకులు తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడాన్ని ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా భాజపా సీనియర్‌ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావులు ఇటీవల తమ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి రంగంలోకి దిగి ఈ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో ఆరా తీస్తున్నారు. వారు సరైన సమాధానమివ్వకపోతే షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని