డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి యూపీలో ఏదీ?

ప్రధాని మోదీ చెప్తున్న డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కడుందని  ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ప్రధాని ఎంపీగా ఉన్న, భాజపా పాలిత రాష్ట్రమైన యూపీ వైద్యరంగంలో దేశంలోనే అట్టడుగున, తెలంగాణ మాత్రం దేశంలోనే మూడో స్థానంలో

Published : 19 Jan 2022 05:15 IST

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ నిలదీత
317 జీవోతో నిరుద్యోగులకు ఉద్యోగాలు

కోయిలకొండలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: ప్రధాని మోదీ చెప్తున్న డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కడుందని  ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ప్రధాని ఎంపీగా ఉన్న, భాజపా పాలిత రాష్ట్రమైన యూపీ వైద్యరంగంలో దేశంలోనే అట్టడుగున, తెలంగాణ మాత్రం దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక ఇచ్చిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌, కోయిలకొండ మండల కేంద్రాల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలను హరీశ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు దేశంలో మొత్తం 173 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో నంబరును రద్దుచేయాలని భాజపా అంటోందని, అలా చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఈ జీవో ద్వారా ఉద్యోగులను వారి జిల్లాలకు పంపిస్తే.. ఖాళీగా ఉన్న చోట నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చని వెల్లడించారు. తద్వారా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగణంగా విడుదలైన ఈ జీవోను భాజపా వ్యతిరేకించటం ఏంటన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 10.62లక్షల ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. భాజపా నేతలకు పాలమూరుపై ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ‘మన ఊరు-మన బడి’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్థాయికి మారతాయన్నారు. ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. జన్‌ధన్‌ ఖాతాలో వేస్తానన్న డబ్బులు ఎక్కడికి పోయాయని భాజపా నేతలను ప్రశ్నించారు. కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, డీఎంఈ రమేష్‌ రెడ్డి పాల్గొన్నారు.

వచ్చే మూడు వారాలు జాగ్రత్త: కరోనా కేసుల నేపథ్యంలో వచ్చే మూడు వారాలు కీలకమని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు  సూచించారు. ప్రస్తుత వేరియంట్‌ ఒకరి నుంచి పది మందికి వ్యాపిస్తోందన్నారు. ఎవరైనా వైరస్‌ సోకితే భయపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి డబ్బు వృథా చేసుకోవద్దన్నారు. గ్రామాల్లో ఏఎన్‌ఎం, ఆరోగ్య ఉపకేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని అర్హులంతా వ్యాక్సిన్‌ తీసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. కొవిడ్‌ సోకిన గర్భిణుల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌, వార్డులు ఏర్పాటు చేశామని, సురక్షితంగా అక్కడ కాన్పులు చేస్తారని మంత్రి భరోసా కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని